ఆ మూడు కేసుల్లోనూ ‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి | Sakshi
Sakshi News home page

ఆ మూడు కేసుల్లోనూ ‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

Published Mon, May 27 2024 4:13 AM

TD Questions Interim Bail for Pinnelli

ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు 

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు 

ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది 

ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది 

ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు 

అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు 

ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి 

హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 

మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు

సాక్షి, అమరావతి: ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే పోలీసులు వేర్వేరుగా మరో మూడు కేసులు నమోదు చేయడాన్ని సవాలుచేస్తూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం చేశానంటూ నమోదు చేసిన ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆదివారం అయినప్పటికీ ఈ వ్యాజ్యాల అత్యవసర దృష్ట్యా న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన ఇంటి వద్దే విచారణ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. అందరి వాదనలు విన్న న్యాయ­మూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..
పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్‌ అసాధారణ రీతిలో వ్యవహరిస్తోందన్నారు. ఎప్పుడూ కూడా ఎన్నికల కమిషన్‌ ఇలా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌ కక్ష సాధింపు ధోరణి చూపుతోందని.. తన పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అది ఎందుకో అర్థంకావడం లేదన్నారు.

ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే తెల్లారేలోపు పిన్నెల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. అప్పటివరకు ఆ కేసుల గురించి కనీన ప్రస్తావన కూడా తేలేదన్నారు. ఘటన 13న జరిగితే పది రోజుల తరువాత పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. అలాగే, మరో కేసును కూడా ఘటన జరిగిన పది రోజుల తరువాత నమోదు చేశారని తెలిపారు. ఓ కేసులో ఫిర్యాదుదారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. హత్యాయత్నం చేశారని పది రోజుల తరువాత ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి, ఘటన జరిగిన రోజునే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. కట్టుకథ అల్లి, ఎలాగైనా పిన్నెల్లిని అరెస్టుచేయాలన్న దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మూడు కేసులు కూడా ఎన్నికలకు సంబంధించినవేనని.. ఒకే అంశంపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవన్నారు.

కేసుల నమోదులో పది రోజుల జాప్యం ఎందుకు జరిగిందో చెప్పడంలేదన్నారు. పిన్నెల్లి దాడిచేశారని చెబుతూ ఓ నిమిషం వీడియోను బయటపెట్టారని, వెబ్‌క్యాస్టింగ్‌ ఉన్నప్పుడు మొత్తం వీడియోను పరిశీలించి ఆ తర్వాతే చర్యలు తీసుకుని ఉండాల్సిందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు మూడు కేసులు పెట్టారని, రేపు ఇంకొన్ని కేసులు పెడతారని, వీటి వెనుక ఎవరున్నారో పోలీసులకు బాగా తెలుసునన్నారు.

అలా చేయడం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అవమానించడమే..
ఈ కేసులో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందుకే రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) ఉండగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించుకునేందుకు మరో ప్రైవేటు న్యాయవాదిని నియమించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇలా చేయడం పీపీని అవమానించడమేనన్నారు. ఒకవేళ ప్రైవేటు న్యాయవాది ప్రత్యేకంగా వాదనలు వినిపించాలనుకుంటే అందుకు ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి లేకపోవడంతో, ఫిర్యాదుదారు అయిన పోలీసు తరఫున ఆ న్యాయవాది హాజరవుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి తమ ముందస్తు బెయిల్‌ను పీపీ తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా కూడా ఓ ప్రైవేటు న్యాయవాదిని నియమించుకోవాలని ప్రయత్నించారంటే తెర వెనుక ఎంత వ్యూహ రచన జరుగుతోందో అర్థంచేసుకోవచ్చునన్నారు.

ఈవీఎం ధ్వంసం కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు నుంచి రక్షణనిచ్చారని, ఈ కేసుల్లో కూడా అలాంటి రక్షణనే ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. అలాగే, హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని.. అందుకు నిర్ధిష్ట విధానం ఉందని ఆయన వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై మరో కేసు పెట్టారని, ఇది ఎంతమాత్రం చెల్లదన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా పిన్నెల్లిని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్, పోలీసులు పనిచేస్తున్నారని న్యాయమూర్తికి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారు..
తరువాత పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసే సందర్భంలో పిన్నెల్లిపై నిఘా పెట్టాలని ఈ కోర్టు పోలీసులను ఆదేశించిందన్నారు. అయితే, ఇప్పటివరకు పిటిషనర్‌ ఆచూకీ తెలీలేదని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాల ఆధారంగా కేసులు పెట్టామని తెలిపారు. పిన్నెల్లి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్‌కు అర్హుడు కారన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు. కౌంటింగ్‌ రోజున మరిన్ని అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.
పిన్నెల్లిని ఎప్పుడు నిందితుడిగా చేర్చారో చెప్పండి..

ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌­రెడ్డి స్పందిస్తూ.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే ఈ కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి కూడా తామెలా బయటకు రాగలమన్నారు. ఈ కేసులన్నీ కూడా పాత తేదీలతో నమోదు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. క్రైం నెంబర్‌ 59లో పిన్నెల్లిపై ఎప్పుడు కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. 23న చేశారని నిరంజన్‌రెడ్డి చెప్పగా, కాదని 22నే చేశామని పీపీ నాగిరెడ్డి చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని, ఈవీఎంల కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చిన తరువాతే పిన్నెల్లిని నిందితునిగా చేర్చారన్నారు. ఇక్కడే పోలీసుల కుట్ర బయటపడుతోందన్నారు. పోలీసులు పీపీకి సైతం వాస్తవాలు చెప్పడంలేదన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారన్నారు.

పిన్నెల్లి చరిత్రను చూడండి..
అనంతరం.. సీఐ నారాయణస్వామి తరఫు న్యాయ­వాది ఎన్‌. అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ, ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు పిటిషనర్‌ పిన్నెల్లి చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే ఆయన పలు నేరాలకు పాల్పడ్డారన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి, క్రైం నెం 59లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పీపీని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

అస్మిత్‌ విషయంలో మాట్లాడని పోలీసులు
ఇక తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ, ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఎక్కడా కూడా ఆయన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించలేదు. కేవలం షరతులు విధించాలని మాత్రమే కోరారు. అదే సమయంలో ఈవీఎంల కేసులో పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. వాస్తవానికి.. ఆ కేసులో పిన్నెల్లిపై హత్యాయత్నం ఆరోపణలు లేవు. కానీ, టీడీపీ అభ్యర్థి అస్మిత్‌పై ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అస్మిత్‌ విషయంలో ఓ రకంగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి విషయంలో మరో రకంగా వ్యవహరించారు. ఇదంతా కూడా పోలీసులు కావాలనే చేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.

పోలీసుల తరఫున ప్రైవేటు న్యాయవాది అసాధారణం..
ఇదిలా ఉంటే.. పిన్నెల్లి విషయంలో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు అసాధారణంగా ఉన్నాయి. అందుకు ఆదివారం హైకోర్టులో జరిగిన పరిణామాలే నిదర్శనం. ఫిర్యాదు­దారుగా ఉన్న పోలీసు తరఫున ఓ ప్రైవేటు న్యాయవాది హాజరుకావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఫిర్యాదుదారుగా ఉన్న కేసుల్లో ఇప్పటివరకు ఆ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరైన ఉదంతాలు హైకోర్టు చరిత్రలో ఇప్పటివరకు లేవు. సాధారణంగా పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటరే హాజరవుతుంటారు. అయితే, పిన్నెల్లి విషయంలో డీజీపీ కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ  చూపుతుండటంతో అసాధారణ పరిణా­మం చోటుచేసుకుంది.

కారంపూడి కేసులో ఫిర్యాదుదారు అయిన సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ హాజర­య్యారు. వాస్తవానికి.. పిన్నెల్లిపై ఉన్న కేసుల్లో పోలీసుల తరఫున వాదనల కోసం అశ్వనీకుమార్‌నే నియమించుకోవాలని డీజీపీ కార్యాలయం భావించింది. అయితే, అందుకు ప్రభుత్వం జీఓ జారీచేయాల్సి ఉండటంతో వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. చివరకు నారాయణస్వామి తరఫున అశ్వనీకుమార్‌ను రంగంలోకి దించారు.

అశ్వనీకుమార్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు రమేష్‌కుమార్‌ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిగా అశ్వనీకుమార్‌ను నియమించారు. తన పదవీ విరమణ తరువాత కూడా వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులు అశ్వనీ వాదించారు. ఇప్పుడు పిన్నెల్లి కేసులో అశ్వనీకుమార్‌ తెరపైకి రావడం వెనుక కూడా నిమ్మగడ్డ ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. అలాగే, టీడీపీ, జనసేన నాయకుల తరఫున కూడా అశ్వనీకుమార్‌ కేసులు వాదించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement