234 స్థానాలకు 6,222 నామినేషన్లు దాఖలు

Tamil Nadu Assembly Polls 2021 6222 Nominations Filed For 234 Seats - Sakshi

తమిళనాట పంచముఖ సమరం

ముగిసిన నామినేషన్ల పర్వం

సాక్షి, చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ సమరం నెలకొంది. ఇందులో ప్రధాన కూటములుగా డీఎంకే – కాంగ్రెస్, అన్నాడీఎంకే – బీజేపీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 234 స్థానాల కుగాను 6,222 నామినేషన్లు దాఖలయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే – 173, కాంగ్రెస్‌ –25, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే లు తలా ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌–3, మనిద నేయ మక్కల్‌ కట్చి 2, కొంగునాడు మక్కల్‌ కట్చి–3, తమిళగ వాల్వురిమై కట్చి, ఫార్వర్డ్‌బ్లాక్, ఆది తమిళర్‌ పేరవై, మక్కల్‌ విడు దలై కట్చిలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

ఇందులో ఎండీఎంకే, మనిదనేయమక్కల్‌ కట్చి, కొంగునాడు మక్కల్‌ కట్చిలతో పాటు చిన్న పార్టీలు డీఎంకే ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. ఈ దృష్ట్యా, ఆపార్టీ చిహ్నంపై 188 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో ఆ పార్టీ –179, పీఎంఏకే –23, బీజేపీ–20, తమిళ మానిల కాంగ్రెస్‌–6, పెరుం తలైవర్‌ మక్కల్‌ కట్చి, తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తలా ఓ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చిన్న పార్టీలన్నీ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీ చేయనున్నాయి. 

కూటములు.. నటులు..
అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం కూటమిలో డీఎండీకే, ఎస్‌డీపీఐలు ఉన్నాయి. ఇందులో డీఎండీకే 60, ఎస్‌డీపీఐ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలి న చోట్ల దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విశ్వనటుడు కమలహాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం, మరో నటుడు శరత్‌కుమార్‌ నేతృత్వంలోని ఎస్‌ఎంకే, రవిపచ్చముత్తు నేతృత్వం లోని ఐజేకేలు ఓ కూటమిగా, సినీ నటుడు, దర్శకుడు సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. ఐదు కూటములుగా పంచముఖ సమరం సాగుతున్నా, ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగనున్నాయి.

ఈ రెండు పార్టీలు ఇప్పటికే ప్రజల్ని ఆకర్షించే దిశగా ఉచిత పథకాలతో, ప్రగతి నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో కన్వీనర్‌ పళని స్వామి, డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎంకే స్టాలిన్‌ సుడిగాలి ప్రచార పర్యటనలో ఉన్నారు. ఈ ఇద్దరు పరస్పరం వ్యక్తిగత విమర్శలతో సైతం ప్రచారం ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎనిమిది మంది కేంద్ర మంత్రుల ప్రచార సభలు ఈ నెల 23 తర్వాత సాగనున్నాయి.

6,222 నామినేషన్ల దాఖలు..
ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం సాగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రంతో నామినేషన్లు ముగిశాయి. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు అందిన సమాచారం మేరకు 234 స్థానాల్లో పోటీ నిమిత్తం 6,222 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 5,274, మహిళలు 945 మంది కాగా, ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుదిజాబితా అదే రోజున వెలువడనుంది. అన్నాడీఎంకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, చంద్రశేఖర్‌ ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పెరుంతురై, సెంతామంగళం నియోజకవర్గాల్లో రెబల్స్‌గా పోటీలో ఉన్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top