
మంత్రివర్గ విస్తరణపై అసలేం జరుగుతోంది..
అధిష్టానం వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ
ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు..ముమ్మర కసరత్తు
తాజా భేటీల్లోనూ కుదరని ఏకాభిప్రాయం
ఇప్పుడీ తలనొప్పి ఎందుకనే యోచనలో అధిష్టానం పెద్దలు!
కేబినెట్ ప్రక్షాళనపైనా దృష్టి..కొంత సమయం ఇచ్చే అవకాశం
ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గంతోనే సరి.. 30న భేటీ తర్వాత ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం నడుస్తుండడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ పెద్దలతో చర్చల కోసం వెళ్లడం, నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన సీఎం రేవంత్ ఆ తర్వాత ఒకరోజంతా అక్కడే వేచి ఉండడం, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమైన అధిష్టానం పెద్దలు ఈనెల 30న మరోమారు రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారమిచ్చిన నేపథ్యంలో అసలేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా, అధిష్టానం ఈసారైనా అనుమతిస్తుందా..లేదా? అన్న సంశయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక అంశాలు బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం లేనిపోని తలనొప్పులు ఇప్పుడెందుకనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నెల 30 తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటనతోనే సరిపెడుతుందని, మరికొన్ని రోజుల తర్వాతే కేబినెట్ విస్తరణ ఫైల్‌ను కదిలిస్తుందనే అభిప్రాయం గాం«దీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ పీటముడులు వీడవా?
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో పడిన పీటముడులు వీడేవి కావనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. జనగణనలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చాలని, ఎవరి వాటా ఎంతో తేల్చాలని కోరుతున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతలకు ఎన్ని బెర్తులిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడున్న రెండింటికి తోడు మరొకటి వస్తుందని అనుకుంటున్నా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.
ఇక జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కుదరని పొంతన, టీపీసీసీ కార్యవర్గానికి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు, అసెంబ్లీలో ఇచ్చే పదవులకు మంత్రివర్గ విస్తరణతో లింకు పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం పక్షాన ఇచి్చన హామీలను నెరవేర్చడం, సీఎం అభిప్రాయం, ఇతర సీనియర్ల ప్రతిపాదనలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు... ఇలా కావాల్సినన్ని పీటముడులు ఉన్న ఈ అంశం అసలు పరిష్కారమయ్యే మార్గం కూడా దొరకడం లేదనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు కూడా ఈ సాగదీతకు కారణమని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలనుకుంటే ఇంకో ఆరు నెలల సమయమిచి్చ, పనితీరు సరిగా లేని వారిని కూడా పక్కనపెట్టి, వారి సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి విస్తరణ పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో కాంగ్రెస్ పెద్దలున్నట్టు సమాచారం.
ఏకాభిప్రాయమెలా సాధ్యం?
మంత్రివర్గ విస్తరణ కోసం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు పలుమార్లు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పటి నుంచే ఇటు సీఎం నివాసం, అటు ఏఐసీసీ కార్యాలయం వేదికగా చాలాసార్లు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీతో కూడా చర్చోపచర్చలు జరిపారు.
చివరకు మార్చి నెలలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా ఇక అన్ని చర్చలు అయిపోయాయని, తమ ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం ముందుంచామని, విస్తరణ బంతి అధిష్టానం కోర్టులో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని (స్తంభించిందని), ఈ వ్యవహారాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుందని అధికారికంగానే చెప్పారు. అయితే ఇంతా జరిగి, ఇన్ని చెప్పిన తర్వాత మళ్లీ ఢిల్లీ వేదికగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు దేనికి సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు.
గతంలో కుదరని ఏకాభిప్రాయం ఇప్పుడెలా సాధ్యమవుతుందని, ఏకాభిప్రాయం పేరుతో ఈ సాగదీత ఎందుకనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారీ్టలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జాప్యం అంశంలో అసహనంతో ఉన్నారని, వీలున్నంత త్వరలో తమకు కేబినెట్ హోదా ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకునే పని ప్రారంభిస్తామని తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
అయితే.. అనూహ్యమే
ప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ తర్వాత కూడా పీసీసీ కార్యవర్గ ప్రకటన మాత్రమే ఉంటుందని, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మరికొంత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వస్తే అది అనూహ్యమేనని, అలా జరిగినా రెండు లేదా మూడు బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం. మరికొంత సమయం తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలను ఇచ్చి ఈ బెర్తులను భర్తీ చేసే అవకాశముంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.