టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: ఈటల

Shamirpet: Etela Rajender Press Meet After Joining In BJP - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు

ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైంది

2024లో తెలంగాణలో ఎగిరే జండా కాషాయం జెండా

మేడ్చల్‌ సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకనని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో కలిసి బుధవారం ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తి తామే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఎన్నిక ఉండబోతోందన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం స్పూర్తిని నింపిందని తెలిపారు. బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నానని, 2024లో తెలంగాణలో ఎగిరే జండా కాషాయం జెండా అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకుంటే.. పేరు, గుర్తింపు కెప్టెన్‌ వచ్చేవి కావని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని తెలిపారు. గడ్డిపోస కూడా ఇప్పుడు అవసరపడుతుందని, ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరి తోడ్పాటుకు ధన్యవాదాలు తెలిపారు. తను ఉద్యమంలో ప్రజల కాళ్ళ మధ్యలో తిరిగిన వ్యక్తిని అని, సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో ఉద్యమంలో కలసి పనిచేశానని వెల్లడించారు.

‘నా డీఎన్‌ఏను పక్కన పెడితే.. మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి. చరిత్ర మెదలు వావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పనిచేశాను. నా ఇల్లు మేడ్చల్‌లోనే ఉంది. వాళ్ల కళ్ళలో మెదిలిన బిడ్డను నేను. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను. భూమి గుంజుకున్న లోంగిపోలేదు. కానీ ఇప్పుడు చట్టం కొంతమందికే పని చేస్తుంది. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దు అని సమాజం అంతా అనుకుంటుంది. గుణపాఠం చెప్పాలి. అహంకారానికి ఘోరీ కట్టాలి’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

అనంతరం మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. నయా నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి చేయడమే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉంటామని, హుజూరాబాద్‌లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.

చదవండి: 
బీజేపీలోకి ఈటల: మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ
కమ్యూనిజం నుంచి కాషాయానికి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top