Tamil Nadu: ‘పళని’ దూకుడుకు కళ్లెం.. పన్నీరు శిబిరంలో ఆనందం

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి దూకుడుకు సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తొలుత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు.
అలాగే జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మరో తీర్పు రావడంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు స్వీకరించారు. ఈ హోదాతో పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సమావేశాలు, సభలు అంటూ విస్తృతంగా దూకుడు పెంచారు. త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు.
ఇందులో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశం సభ్యులతో ముందుగానే తనకు మద్దతు తెలిపే విధంగా సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు.
నిబంధనలు ఉల్లంఘించారని వాదనలు
పన్నీరుసెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారించేందుకు తొలుత న్యాయమూర్తి నిర్ణయించినా, పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు ఉంచారు. అన్నాడీఎంకేలో నిబంధనలకు అనుగుణంగా పన్నీరుసెల్వం నడుచుకున్నా, పళని స్వామి తరపున వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారని వివరించారు. పార్టీ పరంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు.
అయితే, పన్నీరును పార్టీ నుంచి బయటకు పంపించినట్లు ప్రకటించి, వ్యక్తిగతంగా పళని స్వామి నిర్ణయాలు తీసుకుని, పార్టీ నిబంధనలను తుంగలో తొక్కినట్టు వివరించారు. సర్వసభ్య సమావేశాన్ని ఆగమేఘాలపై నిర్వహించారని, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పళనిస్వామి అన్నాడీఎంకే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేయాలని కోరారు. అరగంట పాటుగా వాదనలు సాగాయి.
పళని శిబిరానికి షాక్
పళనిస్వామి తరఫు న్యాయవాదులు సైతం కోర్టు ముందు వాదనలు ఉంచినా చివరకు ఈ కేసుతో పాటు అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తెచ్చి దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొంటూ స్టే విధించారు. దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగింపు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దీంతో పళని స్వామి శిబిరానికి షాక్ తప్పలేదు. దసరా సెలవుల అనంతరం జరిగే విచారణ, వెలువడే ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పళని స్వామి మద్దతు నేత, ఎంపీ సీవీ షన్ముగం కోర్టు ఆవరణలో మీడియా మాట్లాడారు. తాము ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అయితే కోర్టుకు పన్నీరు తరఫున తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని పేర్కొన్నారు.
చట్టాన్ని తాము గౌరవిస్తామని, ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు తనకు అనుకూలంగా రావడంతో ఇదే అదనుగా పార్టీ కేడర్‌ను తన వైపుకు తిప్పుకునే విధంగా దక్షిణ తమిళనాడులో పర్యటనలకు పన్నీరు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం గమనార్హం.