రాజ్యాంగం చదివిన నాయకులెందరు? | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం చదివిన నాయకులెందరు?

Published Sat, Oct 28 2023 2:37 AM

Sakshi interview with Former State Election Commissioner Nagireddy

ప్రజల కోసం కాకుండా, పవర్‌ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయనేది రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆవేదన. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్టుగానే పార్టీలు చూస్తున్నాయన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. కార్పొరేట్‌ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయన్నది ఆ పెద్దాయన నిశిత పరిశీలన. 

సీనియర్‌ ఐఏఎస్‌గా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డి తెలంగాణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా..రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో పార్టీలూ, వారిచ్చే జనాకర్షణ పథకాల హామీలు..మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై ‘సాక్షి’తో నిర్మొహమాటంగా తన భావాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే. 

పునాదుల్లేని  పథకాలు 
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పొలిటికల్‌ తప్ప... ప్రొసీజర్‌ కన్పించడం లేదు. బ్యూరోక్రాట్స్‌ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశం ఉండటం లేదు. సంక్షేమ పథకాలకు పురిట్లోనే పునాది వేయాలి. మనకుండే అవకాశాలు, ప్రజల డిమాండ్, వనరులు... ఇవన్నీ పరిశీలించాకే పథకాన్ని అమలు చేయాలి. కానీ తెలంగాణ లో అలాంటి కసరత్తు లేదు. పాలించే నేత కలలో వచ్చిందే పథకమైతే... దానికి పునాదులెక్కడుంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ పథకమైనా పూర్తిస్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఇది ప్రజలకు నిరాశ కల్గించే అంశమే కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతుంది. 

స్థానిక సంస్థలకే బాధ్యతలిస్తే...? 
సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. జవాబుదారీతనం పెరుగుతుంది. అధికారులకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల రకరకాల ఒత్తిడులు ఉంటాయి. స్థానిక గ్రామ సర్పంచ్‌ నేతృత్వంలో లబ్దిదారుల ఎంపిక జరిగితే... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక పథకాల రూపకల్పన, వాటి విధివిధానాలు పల్లె ప్రజల మనోభావాల్లోంచి పుట్టుకురావాలి. దురదృష్టమేంటంటే ... మన నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండటం లేదు. వారి అభిరుచి ఏంటో తెలుసుకోవడం లేదు.  

రైతుకు ఇస్తున్నదేంటి? 
ఓట్ల రాజకీయంలో రైతు పాత్ర ముఖ్యమైంది. అందుకే రైతుకు పోటీపడి పథకాలు ఇస్తామంటున్నాయి పార్టీలు. నిజాన్ని ఒక్కసారి పరిశీలించండి. మనం రైతుకు ఇస్తున్నదెంత? ఇచ్చేవన్నీ ఉచితాలేనా? కానేకాదు. రైతు ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తు న్నాయి ప్రభుత్వాలు. కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. విత్తనం రైతే తన పంటలోది వాడేవాడు. పశు సంపద ద్వారా వచ్చే ఎరువే వాడుకునే వాడు. అరకతో దున్నేవాడు. పురుగుమందుల ముచ్చటే లేదు.

ఇక రైతు ట్యాక్స్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కడ? కానీ ఇప్పుడు విత్తనం. పురుగుమందు, ఎరువులు, ట్రాక్టర్లు అన్నీ మార్కెట్లో కొనాల్సిందే. ప్రతీ చోట రైతు ట్యాక్స్‌ కట్టాల్సిందే. అంటే ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో రైతు వాటా సున్నా నుంచి ఎన్నో రెట్లు పెరిగింది? ఇంకా ఉచితాలు ఇచ్చామంటారేంటి? గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుంది.  

భూముల విలువలు పెరగడం అభివృద్ధా? 
గ్లోబలైజేషన్‌ తర్వాత భూమి కూడా ఓ పెట్టుబడి వస్తువైంది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులు ఎంచుకున్నాయి. అందుకే వాటి విలువ పెరిగింది. ఎకరం రూ. కోటికి అమ్ముడైన రైతు రూ. 50 లక్షలతో వేరొక చోట  కొంటున్నాడు. అక్కడి రైతు వేరే చోటుకు ఇలా భూముల అమ్మకాలు సాగుతున్నాయి. అంతే తప్ప అభివృద్ధి వల్లే భూములు పెరిగాయని చెప్పలేం. 

పల్లెలెందుకు ఖాళీ అవుతున్నాయి? 
ప్రతీ పల్లెకూ రోడ్లున్నాయి. నీళ్లున్నాయి. కరెంట్‌ ఉంది. నెట్‌... డిష్‌ అన్నీ ఉన్నాయి.  పట్టణాలకు సరిసమానంగానే ఉన్నాయి. కానీ పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పట్టణంతో ముడిపడి ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నా... జనం లేని పల్లెలను మనం చూస్తున్నాం. ఇలా అయితే, మన గ్రామీణ వ్యవస్థ ఏమవుతుంది? దీన్ని పార్టీలూ ఆలోచించాలి.  

రాజకీయమే తప్ప.. రాజ్యాంగం గురించి తెలుసా? 
ప్రపంచీకరణ ప్రభావం కావొచ్చు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతమంది నాయకులు రాజ్యాంగం చదివారు? ఎంతమందికి చట్టాల గురించి తెలుసు?  వారు చెప్పిందే చట్టం అనుకుంటున్నారు. ప్రజలకు ఇష్టమొచ్చినట్టుగా వాగ్దానాలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తమకెందుకు అంటున్నారు. ఏదైనా పథకం తేవాలంటే అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.

ఐదు గంటల్లో పథకం రూపురేఖలు వెల్లడించాలనే ఒత్తిడి తెస్తున్నారు. డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో మినహా... తెలంగాణలో  ప్రభుత్వ పథకాలు ప్రకటించిన విధంగా అమలవ్వలేదు. ఉప ఎన్నికలొస్తే ఆ ప్రాంతానికి మాత్రమే హడావిడిగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఇంకేదైనా రాజకీయ అవసరం అనుకుంటే ముందుకెళ్తారు. ఇదెక్కడి గవర్నెన్స్‌. కార్పొరేట్‌ స్టైల్‌లో ఉందే! 

ఇదేం ఎన్నికల నిఘా! 
ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ పనితీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజు రూ. లక్షల్లో నగదు, నగలు పట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎన్నికలకు తరలిస్తున్నదా? ఓ వ్యాపారి నగదు తీసుకెళ్తుంటే పట్టుకోవడం, సాధారణ పౌరుడి వద్ద డబ్బు దొరికిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ నిఘా వ్యవస్థ ప్రజలను పీడించేలా ఉంది.

నేను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అనుమానం ఉంటే పేరు రాసుకుని అతనికి రాజకీయాలకు సంబంధం ఉందా? అనేది విచారణ చేయమన్నాం. ఇంతమందిని పట్టుకున్నారు సరే. ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నాడా?  అసలు పంచాల్సిన డబ్బు ఎప్పుడో పల్లెలకు చేరిందనేది నా అనుమానం. అక్కడ వెదకాల్సింది పోయి... అడుగడుగునా సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. 

- వనం దుర్గాప్రసాద్‌ 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement