‘బోడిగుండు మీద బొచ్చు మొలిచేది లేదు.. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు’

Revanth Reddy Fire On BJP Leaders In Hath Se Hath Jodo Yatra - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘బోడిగుండు మీద బొచ్చు మొలిచేది లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు’అని టీపీసీసీ అ«ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో మీరెంత ? మీ పార్టీ ఎంత? మీ బిచాణా ఎంత.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని పదే పదే అంటున్నారు.. ఈ సభకు వచ్చిన జనాలను వీడియో తీసి ఆక్కడున్న గుండుకు.. ఆపైన ఉన్న బండకు పంపాలి’అని ఎద్దేవా చేశారు.

హాథ్‌సే హాథ్‌ జోడోయాత్రలో భాగంగా మంగళవారం ఆయన భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ భాషలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారని, రూ.23 లక్షల కోట్లు ఖర్చుచేశారని, అయితే ఏ గ్రామంలోనూ ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రాలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని రేవంత్‌ అన్నారు.

ఆఖరికి రాముడి గుడికి ఇస్తానన్న రూ.వంద కోట్లు కూడా ఇవ్వకుండా స్వామివారినే మోసం చేశారని, దేవుడికిచ్చిన మాట తప్పినోడు ఇక ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.  

బీజేపీ, బీఆర్‌ఎస్‌లతో విసిగిపోయిన ప్రజలు 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోయారని ‘ఇక చాలు, మీ వల్ల కాదు, రాబోయే ఎన్నికల్లో మా ఓటు కాంగ్రెస్‌కే’అనే భావనలో ఉన్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే వరంగల్‌ డిక్లరేషన్‌ అమలు చేస్తామన్నారు. సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌ పరిస్థితి ‘నాంపల్లి దర్గా దగ్గరా అల్లాకే నామ్‌పే దేదే బాబా’అన్నట్టుగా ఉండేదని విమర్శించారు.

జీఎస్టీ కారణంగా పెద్ద పెద్ద కార్లు ఉన్నోళ్లు కూడా హోటల్‌కి వెళ్లకుండా బండి దగ్గర టిఫిన్లు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అంతకుముందు అశ్వాపురం మండలంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. రైతులు, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌ భూ నిర్వాసితులలో ముఖాముఖి నిర్వహించారు. ఆమెర్ద గ్రామ సమీపంలోని పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top