యువత కోసమే తొలి అడుగు | Sakshi
Sakshi News home page

యువత కోసమే తొలి అడుగు

Published Tue, Nov 28 2023 1:16 AM

Rahul Gandhi Release Emotional Video After Meeting Telangana Unemployed Youth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని యువతను ఆదుకోవడమే లక్ష్యంగా తొలిఅడుగు వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహు ల్‌గాంధీ వెల్లడించారు. అక్కడి నిరుద్యోగులు, యువతతో ముచ్చటించిన సందర్భంలో తాను చూసిన, విన్న విషయాలు తీవ్రంగా కలచివేశాయ ని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఇటీవల హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన వీడియో ను సోమవారం ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘నేను ఒకసారి తెలంగాణ యువతతో సమావేశమయ్యాను. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవడం, ఈ లీకేజీల్లో కేసీఆర్‌ బంధువుల పాత్ర ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులతో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించే దిశలో మేం మొదటి అడుగు వేస్తాం.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్‌ కేలండర్‌ ఇప్పటికే విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ద్వారా విద్యార్థులు.. కళాశాల, యూనివర్సిటీ, కోచింగ్‌ ఫీజులు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తాం. అది తెలంగాణ యువత కోసం మేం వేయబోయే ముందడుగు..’అని ఆ వీడియోలో రాహుల్‌ చెప్పారు. దొరల సర్కారులో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్‌నగర్‌లో తన తాజా భేటీతో స్పష్టమైందని, తమ పార్టీ ఇచ్చిన జాబ్‌ కేలండర్‌ వారికి ఉపశమనం కలిగిస్తుందని, త్వరలో కాంగ్రెస్‌ నేతృత్వంలో రాబోయే ప్రజల సర్కారులో తెలంగాణ యువత భవితవ్యం పదిలంగా ఉంటుందని, ఇది తన గ్యారంటీ అని పేర్కొన్నారు.  

నేడు కార్మిక సంఘాలతో భేటీ: చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30–11 గంటల వరకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఆటో వర్కర్లు, జీహెచ్‌ఎంసీ, జిగ్‌ కార్మికుల సంఘాలతో సమావేశమవుతారని, మధ్యాహ్నం 11:30–12:30 గంటల వరకు నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించి కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ జహీరాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.   
 

Advertisement
Advertisement