పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. పనికిమాలిన బ్యాచ్‌ అంటూ..

Puvvada Ajay Kumar Sensational Comments Ponguleti In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో  పనికిమాలిన బ్యాచ్ ఉందంటూ మాజీ ఎంపీ పొంగులేటి వర్గాన్ని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేయడం లేదని, ఖమ్మంలోనే ఉంటానని స్పష్టం చేశారు.  ఈ మేరకు మంత్రి తన  క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. జనవరి 18న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు.

ఖమ్మం నియోజకవర్గం సన్నాహాక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలవదని మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్‌పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలు పెట్టారన్నారని విమర్శించారు.

‘అజయ్ అన్న కూకట్ పల్లి ఏం పీకటానికి పోతాడు. ఇక్కడి వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఉన్నాడు.. ఇంకా దంచాల్సిన వాళ్ళని దంచాకనే అజయ్ అన్న ఎటైనా పోతాడు.. అజయ్ అన్న సైన్యం చూసి ఎంత భయపడుతున్నారంటే.. అజయ్ అన్నను లోకల్ నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారన్నారు. 

అజయ్ అన్న ఖమ్మం ను అభివృద్ధి చేసిండు.. పాత బస్టాండ్ తీసి కొత్త బస్టాండ్ పెట్టిండు.. మళ్ళీ పాత బస్ స్టాండ్‌ను సిటీ బస్ స్టాండ్‌గా మార్చిండు అని ఈర్ష పడుతున్నారు.  తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి గలగల నీళ్లు పారే విధంగా చేసిన.. అక్క చెల్లెళ్ల బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద సొట్టలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్‌. రెండుసార్లకు ఇవన్నీ చేస్తే మూడోసారి మనకు ముప్పతిప్పలే అని ఈ అబద్దపు నాయకులు ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన ఖామ్మానికి కేసీఆర్‌ ఇచ్చారని, ఖమ్మం మీద గాని ఖమ్మం ప్రజల మీద గాని కేసీఆర్‌కి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మీరు వాట్సాప్ గ్రూప్‌లలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్లు మీరు కూడా యాక్టివ్ ఉండాలి. ఖమ్మం సభను విజయవంతం చేయాలి’ అని పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top