
8న జరిగే సమావేశం నాటికి పరిస్థితిని చక్కదిద్దడం తలకు మించిన భారమే...
పదాధికారుల సమావేశంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు, సమస్యలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య సమన్వయలేమి బీజేపీ(Telangana BJP) నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో కనీసం 15 జెడ్పీలు గెలిచి రాజకీయంగా సత్తా చాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. దీని సాధనకు పార్టీ పూర్తిస్థాయిలో సంసిద్ధమై ఉందా ఉన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా.. రాష్ట్రంలో పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో బలపడేందుకు స్థానిక ఎన్నికలు ఏ మేరకు ఉపయోగపడతాయన్న దానిపై నాయకుల్లో స్పష్టత కొరవడింది. పార్టీలో కొంతకాలంగా అంటే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి పాత–కొత్త నాయకులు, వివిధ స్థాయి నాయకుల మధ్య సమన్వయ సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి, అంతర్గత సమస్యలు మరోసారి బయటపడ్డాయి.
మూడునాలుగేళ్లుగా పలువురు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలుపొందినా కూడా ఇంకా పార్టీలో పాత–కొత్తల వివాదం కొనసాగుతుండడంపై ముఖ్యనేతలు సైతం పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా జిల్లా నుంచి మండల, గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల సమన్వయం, ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వంటివి ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఆ లోగా అందరికీ సర్ది చెప్పే ప్రయత్నాల్లో నాయకత్వం నిమగ్నమైంది.
జిల్లాల్లోనూ అంతే..
జిల్లా పార్టీలో సరైన సమన్వయం లేదంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Vishweshar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాల నిర్వహణ, తదితరాల విషయంలో తన ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల తీరుపై నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పధాదికారుల సమావేశంలో నిలదీశారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈ జిల్లాల అధ్యక్షులపై వచ్చిన ఫిర్యాదులపై మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీనేత గోలి మధుసూదన్ రెడ్డిలతో ఓ కమిటీని అధ్యక్షుడు రామచందర్‌రావు ఏర్పాటు చేసినట్టు సమాచారం.
పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని పధాదికారుల సమావేశంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వాపోయారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు నిర్ణయించడం తప్ప క్షేత్ర స్థాయిలో అసలు అవి ఏ విధంగా అమలు చేస్తున్నారనేదే నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను సైతం సీరియస్‌గా తీసుకున్న నాయకత్వం.. నేతల మధ్య సమన్వయం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, తదితర అంశాలపైనా దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం.