డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గం
డోర్నకల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో గిరిజన నేత డి.ఎస్.రెడ్యా నాయక్ ఆరోసారి విజయం సాదించారు. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ సీటుగా ఉన్నప్పుడు ఈయన నాలుగు సార్లు గెలవడం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో రెడ్యానాయక్ కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లోకి మారిపోయారు. తదుపరి 2018లో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి రామచంద్రునాయక్ పై 17511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రెడ్యా నాయక్‌కు 88307 ఓట్లు రాగా, రామచంద్రు నాయక్‌కు 70926ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.రవీందర్‌కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రెడ్యానాయక్ 2009లో ఓడిపోయినా, 2014లో తన పాత ప్రత్యర్ధి సత్యవతి రాధోడ్‌ను 23531ఓట్ల తేడాతో ఓడిరచారు. 2014లో తెలంగాణ అంతటా టిఆర్‌ఎస్ ప్రభజంనం వీచినా ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. 2009లో టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించిన సత్యవతి 2014లో టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి పోటీచేసి ఓటమిచెందారు.
ఆ తర్వాత కాలంలో ఆమె ఎమ్మెల్సీ అయి 2018 ఎన్నికల తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 1957లో ఏర్పడిన డోర్నకల్ నియోజకవర్గంలో 13సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ గెలిస్తే, ఒకసారి టిడిపి గెలిచింది. ఒకసారి టిఆర్‌ఎస్ గెలిచింది. డోర్నకల్‌లో 1972లో నూకల రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా నెగ్గగా, ఆయన అకాల మరణం తర్వాత 1974లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్. సురేంద్రరెడ్డి ఏకగ్రీవంగా గెలవడం మరో విశేషం.
నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తర్వాత రామసహాయం సురేంద్రరెడ్డి మరో నాలుగుసార్లు, తదనంతరం రెడ్యా నాయక్ మరో ఆరుసార్లు గెలిచారు. నూకల గతంలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. నూకల కొంతకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన సభలో తెలంగాణ యున్కెటెడ్ ఫ్రంట్ ఏర్పడిన శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వున్నారు.
రెడ్యానాయక్ 2004లో గెలిచాక వైఎస్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. సురేంద్రరెడ్డి మహబూబాబాద్ నుంచి ఒకసారి, వరంగల్లు నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. డోర్నకల్‌లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజికవర్గం ఎన్నిక కాగా,నాలుగుసార్లు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు గిరిజన నేత ఎన్నికవడం విశేషం.
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..



