సమాజ్‌వాదీ పార్టీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు

One BJP MLA, 6 rebel BSP MLAs join Samajwadi Party - Sakshi

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీతోపాటు బహుజన సమాజ్‌ పార్టీకి(బీఎస్పీ) చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే, బీఎస్పీ నుంచి ఆరుగురు బహిష్కృత ఎమ్మెల్యేలు శనివారం మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రాథోడ్‌ తమ పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం అలీ, హకీంలాల్‌ బింద్, ముజ్‌తబా సిద్దిఖీ, హరగోవింద్‌ భార్గవ ఎస్‌పీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top