కవిత ఎంట్రీతో ధర్మపురి అరవింద్‌కు టెన్షన్‌! మళ్లీ ఎంపీ కావడం కష్టమేనా?

Nizamabad BJP MP Dharmapuri Arvind in dilemma After Kavitha Entry - Sakshi

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్‌ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్‌కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క..  ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్‌లోకి  ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్‌లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. 

వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది.  ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది.

ఫ్యూచర్ పాలిటిక్స్‌కు చిక్కు
అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్‌కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్‌ లోక్సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ నుంచి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి.

అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.

బరిలోకి అన్న సంజయ్
నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది.

ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో...  అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి  కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...?  అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top