సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయి. సంబంధిత వారిని అరెస్టు చేస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా? అన్నది కాంగ్రెస్ పార్టీనే తేల్చుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో జగిత్యాల రాజకీయాలపై స్పందిస్తూ..‘జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానం. జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని నా అభిప్రాయం. ఈ వయసులో ఆయనను హింసించడం మహాపాపం. మానసిక క్షోభకు గురి చేయడం కాంగ్రెస్‌కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించేవాడిని అంటూ వ్యాఖ్యానించారు.


