‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు? 

Nirmal district people election manifesto - Sakshi

కళాకారులు కోరుతున్నవి.. బొమ్మల తయారీకి కావాల్సినంత పొనికి కర్ర లభించేలా చూడాలి. 

ప్రతీ కళాకార కుటుంబం ఆరోగ్యభద్రతకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందేలా హెల్త్‌కార్డులివ్వాలి. 

 సబ్సిడీ కింద రుణాలు ఇప్పించాలి. 

కళాకారులకు ప్రత్యేకంగా పింఛన్‌ ఇవ్వాలి. 

ప్రతీ కళాకారుడి కుటుంబానికి డబుల్‌బెడ్రూం ఇల్లు ఇవ్వాలి. 

కళను మెరుగుపర్చేలా ఆరునెలలకు ఒకసారి ప్రత్యేక శిక్షణ  ఇప్పించాలి. 

మార్కెటింగ్‌ పెంచడానికి ప్రభుత్వపరంగా మరింత ప్రచారం పెంచి, ప్రోత్సాహం ఇవ్వాలి. 

తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు  పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన  నిర్మల్‌ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ  కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది.

కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు.  ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో  కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

నిర్మల్‌
కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు.

ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. 

కనీసం పింఛన్‌ లేదు.. 
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్‌ లభించడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్‌ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. 

జీవితమంతా బొమ్మలతోనే..
35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది.  సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు.  –పెంటయ్య, నకాషీ కళాకారుడు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top