కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాంగ్‌ సిగ్నల్‌?

Navjot Singh Sidhu meets Sonia Gandhi amid infighting in Punjab Congress - Sakshi

సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఊహాగానాల మధ్య క్యాంప్‌ రాజకీయాలు

హస్తినలో మళ్లీ మొదలైన పంజాబ్‌ పంచాయితీ

సోనియాతో సిద్ధూ, హరీష్‌ రావత్‌ సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా ఎన్నికలకు కెప్టెన్‌ సారథ్యం వహిస్తారని, సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ హరీష్‌ రావత్‌ గురువారం ఇచ్చిన స్నిగల్‌ పరిస్థితిని చక్కదిద్దకపోగా, మరింత ఆందోళనలకు కారణమైంది. కెప్టెన్‌ అమరీందర్‌పై సిద్ధూ అసంతృప్తి, తిరుగుబాటు శైలిని చూసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్న హైకమాండ్‌ ప్లాన్‌ క్యాంపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. సిద్ధూ, కెప్టెన్‌ తమకు అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో క్యాంపు సమావేశాలు జరిపారు.  

నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ అంతకుముందు జూన్‌ 30 న ఢిల్లీకి వచ్చి ప్రియాంకా గాంధీని కలిశారు. అదే సమయంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సైతం పార్టీ అధినేత్రితో భేటీ అయ్యారు. సోనియాతో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ హరీష్‌ రావత్‌ పాల్గొన్నారు. కాగా సిద్ధూ సోనియాగాంధీని కలిసే ముందే ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ పార్టీ అధినేత్రికి ఒక లేఖ పంపించారని తెలిసింది.  

వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కెప్టెన్, సిద్ధూలు కలిసి పనిచేయగల శాంతి సూత్రాన్ని కేంద్ర నాయకత్వం రూపొందిస్తోందని రావత్‌ అభిప్రాయపడ్డారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన రావత్‌ ‘నేను పంజాబ్లో పార్టీకి సంబంధించి నివేదికను సమర్పించడానికి పార్టీ అ«ధినేత్రిని కలిశాను. పంజాబ్‌ కాంగ్రెస్‌ విషయంలో పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే, మీ అందరికీ చెబుతాను’అని అన్నారు. అంతేగాక సిద్ధూను పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా చేస్తున్నారంటూ తను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు.

కాగా, పంజాబ్‌లో సిద్ధూ, ఆయన ప్రత్యర్థి శిబిరం మధ్య పోస్టర్‌ల యుద్ధం మొదలైంది. సిద్ధూ మద్దతుదారులు అమృత్‌సర్, లూధియానాతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల వేసిన పోస్టర్లలో లూధియానాలో కొన్ని పోస్టర్లను చింపేశారు. పార్టీ తీసుకొనే కొన్ని నిర్ణయాలపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు హరీష్‌ రావత్‌ తెరదించారు. ఈ విషయంలో కెప్టెన్‌కి ఏదైనా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉంటే, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని రావత్‌ అన్నారు.  

మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు సన్నిహితుడైన ఎంపీ,  సీనియర్‌ నేత మనీష్‌ తివారీ కూడా ఈ వివాదంలో తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.  సామాజిక సమూహాల మధ్య సమతుల్యతను కాపాడటం ముఖ్యమని, సమానత్వం సామాజిక న్యాయానికి పునాది అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సిక్కులు 57.75 శాతం, హిందువులు 38.49 శాతం, దళితులు 31.94 శాతం ఉన్నారని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు మనీష్‌ తివారీ తన ట్వీట్‌లో కాంగ్రెస్‌ పంజాబ్‌ ఇన్‌ఛార్జ్‌ హరీష్‌ రావత్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో సిద్ధూకి చెక్‌ పెట్టేలా సీఎం అమరీందర్‌కు అనుకూలంగా తివారీ ఈ ట్వీట్‌ చేసినట్లు భావిస్తున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top