రాఫెల్‌ కుంభకోణానికి ప్రధాని మోదీనే బాధ్యుడు  

Narendra Modi Is Responsible For Rafale Scam Says Pawan Khera - Sakshi

ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపణ 

రక్షణశాఖ డాక్యుమెంట్లు సుశేన్‌గుప్తా దగ్గర ఎలా దొరికాయని ప్రశ్న  

సాక్షి, హైదరాబాద్‌: రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కుంభకోణానికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యుడని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విషయంలో ప్రధానికి అధికారం ఉండదని, అయినా మోదీ రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల విషయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. పీఎంవో జోక్యం తగదంటూ రక్షణశాఖ లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. దీన్ని బట్టి ప్రధాని మోదీనే ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యుడని అర్థమవుతోందని పేర్కొన్నారు.

ఈ కుంభకోణానికి సంబంధించిన గతంలోనే పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, గతవారం ఫ్రెంచ్‌ మీడియాలో వచ్చిన కథనంతో ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని నిర్ధారణ అయిందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019, మార్చిలో ఈడీ అధికారులు సుశేన్‌గుప్తా ఇంటిపై దాడి చేసినప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు లభించాయని, రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన పత్రాలు ఆయన ఇంట్లో ఎలా దొరికాయని ప్రశ్నించారు.  

దేశానికి రూ.41,205 కోట్ల నష్టం 
రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు సుశేన్‌గుప్తా అనే దళారి ఇంట్లో ఉన్నాయంటే డసాల్ట్‌ కంపెనీకి, కేంద్రానికి మధ్య ఆయన పోషించిన పాత్ర ఏంటో అర్థమవుతుందని పవన్‌ ఖేరా అన్నారు. అప్పటి నుంచి 2021, నవంబర్‌ వరకు సుశేన్‌గుప్తాపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో, రాఫెల్‌ కంపెనీపై సీబీఐ, ఈడీ ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు.

యూపీఏ హయాంలో 126 ఎయిర్‌క్రాఫ్ట్‌లను రూ.526 కోట్ల చొప్పున కొనుగోలు చేయాలని రాఫెల్‌తో ఒప్పందం కుదిరితే, మోదీ అధికారంలోకి వచ్చాక ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను 36కి తగ్గించి ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌ ధరను రూ.1,670 కోట్లకు పెంచిందని, తద్వారా దేశానికి రూ.41,205 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top