
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని వైఎస్సార్సీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విమర్శించారన్న కేసులో నోటీసులు అందుకున్న ఆయన.. పోలీసు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. ఈ కేసుకు సంబందించి 40 ప్రశ్నలు అడిగారు.. దానికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు.. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు అని ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. మూడుగంటలపాటు ఆయన విచారణ జరిగింది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు షూరిటీస్‌ను తన న్యాయవాది ద్వారా సమర్పించారు.
