ఉప ఎన్నిక: చాప కింద నీరులా వెళ్లాలనేది బీజేపీ వ్యూహం | Nagarjuna Sagar Bypoll 2021 BJP Campaign For Ravi Naik | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నిక: చాప కింద నీరులా వెళ్లాలనేది బీజేపీ వ్యూహం

Apr 12 2021 9:10 AM | Updated on Apr 12 2021 9:11 AM

Nagarjuna Sagar Bypoll 2021 BJP Campaign For Ravi Naik - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సైలెంట్‌ ఓటింగ్‌పైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ ప్రచారం కూడా ఇందుకు అనుగుణంగానే సాగుతోంది. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రవినాయక్‌ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా, పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించకుండానే స్థానిక నేతలతో కలసి ప్రతి గ్రామమూ, ప్రతి ఓటరునూ కలిసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 9 తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన రాష్ట్ర నేతలు, కేంద్రమంత్రులు కూడా కేవలం రోడ్‌షోలకే పరిమితమయ్యారు. ఇప్పటికే మండలాలు, గ్రామాలవారీగా ఇన్‌చార్జీలను నియమించింది. 

ఆర్భాటం వద్దు... ఓటరన్న ముద్దు 
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి మంచి ఊపు మీదికొచ్చిన బీజేపీ ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలబడింది. ఈ ఎన్నికల తర్వాత సాగర్‌ ఉప ఎన్నిక రావడంతో ఇక్కడ వచ్చే ఫలితం పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందనే భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఈ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంది. అందులో భాగంగానే జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టి సామాజిక అస్త్రాన్ని ప్రయోగించింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్టీ ఓట్లు తమ బ్యాలెట్‌ బాక్సులను నింపుతాయని భావిస్తోంది. అభ్యర్థిని ప్రకటించకముందే ప్రచారాన్ని ప్రారంభించింది. టికెట్‌ను ఆశిస్తున్న నేతలంతా పోటాపోటీగా గ్రామాలకు వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థిగా డాక్టర్‌ రవికుమార్‌ను ఖరారు చేసిన తర్వాత పార్టీ నియమించిన ఇన్‌చార్జీలు రంగంలోకి దిగారు. సహాయకులుగా వెళ్లిన ఐదుగురు నేతలతో కలసి వీరు గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.  

ఈ నెల 9 తర్వాత... 
ఈ నెల 9 తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారపర్వంలోకి దిగింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్‌ మేఘావాలేలు 10, 11 తేదీల్లో గ్రామాలకు వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ సోమవారం నుంచి ప్రచారం ముగిసే వరకు సాగర్‌లోనే ఉండనున్నారు. పార్టీ నేత డి.కె.అరుణ ఇప్పటికే నియోజకవర్గంలోనే మకాం వేశారు. ప్రచారం ముగి సే వరకు ఆమె అక్కడే ఉండనున్నారు. ఆమెతోపాటు మాజీ ఎంపీ విజయశాంతి ప్రచార షెడ్యూల్‌ కూడా ఖరారైంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కూడా సాగర్‌లో ప్రచారానికి వెళ్లనున్నారు. ఇప్పటికే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ రాష్ట్ర నేతల ప్రచారానికి అనుగుణంగా కేడర్‌ను సిద్ధం చేస్తోంది. మొత్తం మీద హంగూ, ఆర్భాటాలకు పోకుండానే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో చాపకింద నీరులా వెళ్లి సైలెంట్‌ ఓటింగ్‌ చేయించుకుని సత్తా చాటాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

చదవండి: సాగర్‌ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement