మునుగోడు వార్‌: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్‌

Munugode Bypoll: All Parties Focus On Komatireddy Rajagopal Reddy - Sakshi

సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీపైనే ఫోకస్‌ పెట్టాయి. రానున్న సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. వామపక్షాలు కలిసిరావడంతో కొంతమేరకు ఊరట చెందుతున్నప్పటికీ ఎక్కడో ఓ మూలన కీడు శంకిస్తున్నారు.. ఆ పార్టీ నాయకులు. మొత్తంగా హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. మరోవైపు మునుగోడులో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ.. కాంగ్రెస్‌ ఓట్లపై ఆశలు పెట్టుకొని ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతోంది.
చదవండి: మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు

పోటాపోటీగా..
ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే రానున్న సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఒత్తిడిలో టీఆర్‌ఎస్, బీజేపీలు ఉన్నాయి. అందుకోసం ఆరునూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల ఇంటింటికి వెళ్లి తమదైన శైలిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితోపాటు ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు చౌటుప్పల్‌ మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు కాంగ్రెస్‌ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీల ప్రచారంతో గ్రా మాల్లో  వాతావారణం వేడెక్కింది.

కాంగ్రెస్‌ ఓట్లపై కన్ను
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కాగా కాంగ్రెస్‌ ఓటర్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కన్నేశాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా తనకున్న పరిచయాలు, బంధుత్వాలు, వ్యక్తిగత ఇమేజ్‌తో కాంగ్రెస్‌ ఓట్లకు పెద్ద ఎత్తున గండికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ఓటర్లు బీజేపీలో చేరకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంబీజేపీ గెలుపును అడ్డుకోవడం ద్వారా ము నుగోడులో పూర్వవైభవం సాధించాలన్న లక్ష్యంతో కమ్యూనిస్టులు ఉన్నారు. మంగళవారం చండూరులో సీపీఐ, సీపీఐ(ఎం)లు బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తమ వైఖరిని స్పష్టం చేశాయి. మునుగోడులో పోటీ చేస్తున్నది టీఆర్‌ఎస్‌ అభ్యర్థికాదని వామపక్షాల వ్యక్తిగా భావించి పనిచేయాలని  తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి.

రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకున్న  కార్యకర్తలు
చౌటుప్పల్‌ మండలం అల్లాపురం గ్రామంలో బుధవారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. రాజ గోపాల్‌రెడ్డి తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించి ఎనగండితండాకు వెళ్లిపోయారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top