డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి

MLA Komatireddy Raj Gopal Reddy Fires on Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమని, సమరశంఖం పూరిస్తామని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. వందిమాగధులు, వందల కోట్ల డబ్బు సంచులతో వచ్చే కేసీఆర్‌.. ఆయన కౌరవసేనను ఎదిరించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు.

రాష్ట్రాన్ని సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకుని ప్రజాకంఠక పాలన చేస్తున్న కేసీఆర్‌పై అతి త్వరలో యుద్ధప్రకటన చేయబోతున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి– సంక్షేమ పథకాలను అమలు చేసే సీఎం.. మునుగోడుపై కక్షగట్టి మూడున్నరేళ్లుగా నిధులు మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 90శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా... తనను గెలిపించారన్న అక్కసుతో దాన్ని పక్కకుపెట్టారని ఆరోపించారు.

హుజూరాబాద్‌ మాదిరిగా అన్ని పథకాలు అమలు చేస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఇంతకుముందే చెప్పానని గుర్తుచేశారు. సొంత ఆస్తులు పెంచుకుంటూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాలకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ పాలన నుంచి విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డైలమా, వెనకడుగు తన రక్తంలోనే లేదని.. సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో చేస్తున్న పోరాటం తనది కాదన్నారు. ఇప్పటికే సన్నిహితులు, ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించే కేసీఆర్‌ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top