
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటరిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయనే ఆపుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ బీసీల చాంపియన్. గుడ్డుకు వెంట్రుక కట్టే పని పెట్టుకోవద్దని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ నేతలు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. తెలంగాణ కుల గణన విప్లవాత్మక నిర్ణయమని స్వయానా వారణాసి ప్రజా ప్రతినిధి (ఆర్ఎస్‌ఎస్)నేత నాతో అన్నారు. బీజేపీ నేతలు దుర్బుద్దిని వీడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అంతకంటే ముందు ఇచ్చిన హామీ మేరకు స్పష్టమైన విధానంతో కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చాం.
చట్టం 3, 4 ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. బీజేపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు మీరే ఆపారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్తున్నాం. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడకండి. బీసీ రిజర్వేషన్ల పట్ల మాకు చిత్త శుద్ధి ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందించి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించండి. ఫ్యూడల్ సిద్ధాంతాలతో అడ్డుపడకండి. బిల్లు చట్టబద్ధత కోసం సీఎం రేవంత్, మంత్రులందరం సిద్ధంగా ఉన్నాం.. మీ నాయకులను తీసుకుని రండి ఢిల్లీకి వెళ్దాం.
బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి బీసీలకు ఇవ్వలేరా?. ఆర్డినెన్సు తీసుకొచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే.. దొంగ దొంగ అంటూ డ్రామాలు చేస్తున్నారు. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50 శాతం ఎత్తేసినపుడు.. బీసీ రిజర్వేషన్లు ఎందుకు సాకారం కాదు అని ప్రశ్నిస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే గెలిచేది బీసీ అభ్యర్థి అనే విషయం మరిచిపోకూడదు. బీసీ రిజర్వేషన్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.