
ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన వ్యక్తి కేసీఆర్ ఆత్మ
కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు, పీసీసీ చీఫ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుక్కునైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని తమపై ఒత్తిడులు వస్తున్నాయంటూ దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. కూలుస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోమని ప్రశ్నించారు. మంగళవారం నోవాటెల్ హోటల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదేళ్లే కాదని.. రానున్న మరో ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు.
భూభారతి అమల్లోకి తేవడంతో వారికి భయం పట్టుకుందని, వారి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డిది ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం అనుకున్నానని, ఆయన ఈ మధ్య జ్యోతిషం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమంటే బీఆర్‌ఎస్‌లోని ఆ నలుగురు నాయకులకు కళ్లమంట అని అన్నారు. అందుకే పిల్లి శాపాలు పెట్టిస్తున్నారని, ఆ శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదని అన్నారు.
ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
చోటా మోటా కాంట్రాక్టర్లు కూల్చే ప్రభుత్వం తమది కాదని, అయినా వారు ప్రభుత్వాన్ని కూలిస్తే తాము ఊరుకుంటా మా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. తమ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, ఇలాంటి చోటా బ్యాచ్‌కు తాము భయపడేది లేదన్నారు.
బీఆర్‌ఎస్ నేతలకు ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదని, సంతలో వస్తువులుగా ఎమ్మెల్యేలను చూస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ తదితరులు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.