ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?

Minister Perni Nani Comments On Chandrababu And BJP Leaders - Sakshi

బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలు

పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా?

 బీజేపీపై మంత్రి పేర్ని నాని ఫైర్‌

సాక్షి, అమరావతి: బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలు అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు.. చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 చదవండి: 2021 రివైండ్‌: టీడీపీకి పరాభవ ‘నామం’

‘‘పెరుగుతున్న డీజిల్‌, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలి. పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా?. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదు. ప్రజాగ్రహ సభలో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడాలని’’ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.

‘‘ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహాసనానికి తెరలేపింది. బీజేపీకి ఏపీలో ఒక అజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యలపై దృష్టి ఏమీలేవు. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు...? మీకు చంద్రబాబు ఎజెండా తప్ప మరో ఎజెండా ఉందా మీకు..? వాళ్లు ప్రభుత్వం రాగానే బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. మీరు బ్రాందీ బుడ్డి గురించి బాధపడటం కాదు.. డీజిల్, పెట్రోల్ ధరల గురించి మాట్లాడండి.

మీరు పెట్టిన మీటింగులో డీజిల్, పెట్రోల్ గురించి మాట్లాడండి. పెరిగిన ఎరువుల ధరలు గురించి మీరు ఏ రోజైనా బాధ పడ్డారా...?. 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉన్న ధర ఇవాళ రూ.1700కి వెళ్ళింది. రైతుల ధాన్యం కొనేది లేదంటారు...ఆంక్షలు పెడతారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నందుకు మీరు బాధపడరా...?. కేంద్రమే కదా ధరలు నియంత్రణ చేయాల్సింది. రాష్ట్రాలు కేవలం బ్లాక్ మార్కెట్ పై మాత్రమే చర్యలు తీసుకోగలదు.

ఏపీ తెచ్చిన అప్పులో ప్రతి పైసాకి లెక్క ఉంది. మేము జీఎస్ డీపీలో 3 శాతం లోపు అప్పు తెస్తే గోల చేస్తున్నారు. జీడీపీలో 21 శాతం పైబడి అప్పు తెచ్చింది.. దీనికి కారణం ఎవరు..? 1.35 లక్షల కోట్ల అప్పు నేడు మన దేశానికి ఉంది. ఈ ఏడేళ్లలో 73 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. మీరు ఏపీ అప్పుల గురించి మాట్లాడతారు.. మేము చట్టాలను అతిక్రమించి అప్పు తెస్తే మీరు ఊరుకునేవారా..?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top