టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి?: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబూ?: సీఎం జగన్‌

Published Thu, Apr 4 2024 2:48 PM

Memantha Siddham: CM Jagan Public Interaction At Chinna Singamala - Sakshi

తిరుపతి, సాక్షి: చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్‌ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. 

"ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్‌ నిలదీశారు.  

"వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు. 

"గత ఐదేళ్లుగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్‌ డ్రైవర్లకు అండగా ఉంటున్నాం. ఏడాది రూ.10వేల చొప్పున.. ఈ ఐదేళ్లలో రూ. 50 వేలు సాయంగా ఇచ్చాం. వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామని" సీఎం జగన్‌ తెలిపారు. 

నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును. 
నేను చంద్రబాబునాయుడుగారిని.. అవునయ్యా.. జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు  ఏం తప్పు చేశాడయ్యా? జగన్ అని అడుగుతున్నాను. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరపున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నాను. నిజంగా నీకు, నాకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ అని ఒక వైపున చెబుతూ, మరో వైపున నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను.
ఎందుకు తెలుసా? సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది. 

తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ల మీద ఆధారపడకుండా.. చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మంది.

మొట్ట మొదటి ప్రభుత్వం.. వాళ్లు ఉన్నారు అని గమనించి, వాళ్లకు తోడుగా, అండగా ఉంటూ వాళ్లను ప్రోత్సహించాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోసమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి.. ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. 

ఈ దఫా టిప్పర్ డ్రైవర్లకూ...
మరి ఈ మాదిరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తా కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్లందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా, అండగా ఉంది అని చెబుతూ ఏకంగా 3,93,655 మందికి క్రమం తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3,93,655 మందికి.. వాళ్ల కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ఆర్థిక ఆసరా అందిస్తున్నాం.

మరొక్క సారి చెబుతున్నాను. వాహన మిత్ర అనే స్కీము తీసుకొచ్చి సొంత ట్యాక్సీ గానీ, సొంత ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 58 నెలల కాలంలో రూ.1.296 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట చెబుతున్నాను. మరలా మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కుని, సొంతంగా లారీలు కొనుక్కుని వాళ్ల జీవనం వాళ్లు నడిపించుకుంటున్న వాళ్లను కూడా ఈ జాబితాలోకి తీసుకుని వస్తాం అని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

వీళ్లందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్లంతట వీళ్లు స్వయం ఉపాధి పొందుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మిగిలిన వాళ్లందరికీ కూడా మన నవరత్నాల్లోని అన్ని పథకాలూ ఎలాగూ వాళ్లందరికీ కూడా అందుతున్నాయి. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే, వారింట్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్లింట్లో ఉన్న పెద్దవాళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతున్నాయి.

తిరుపతి జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతున్న వాళ్లు ఎంత మందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు వాహన మిత్ర పొందుతున్నారు. ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది రూ.61 కోట్లు. ఈ 7 సెగ్మెంట్లలోనే ఇచ్చాం.

మీ సలహాలు, సూచనలు ఇంకా ఏమైనా ఉంటే రాసి,  ఆ స్లిప్పులన్నీ కూడా ఆ బాక్సులు వేయండి.  వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది రాయండి. అందరికీ మైకులు ఇవ్వలేం, అందరూ మాట్లాడేంత టైమ్ ఉండదు కాబ్టటి.. మనకు కూడా ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి కాబట్టి.. ఆ స్లిప్పుల మీద మీరు రాసేస్తే, మీరు ఇవ్వాలనుకున్న సూచనలు, సలహాలు ఆ బాక్సులో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. అందులో ఉన్న మంచివేదైనా, ముఖ్యమైనవి ఏదైనా ఉండి మనం ఇన్‌కార్పొరేట్ చేయగలిగినవన్నీకచ్చితంగా చేద్దాం.  ఈ రోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి  మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందాం అని అనుకుంటున్నాను. మైకు మీకు ఇస్తాను. మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ, మీ అన్న మీ తమ్ముడు, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మైకు నేరుగా మీకే ఇస్తాం.  అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement