చిన్న పార్టీల చుట్టూ... 

Meghalaya Nagaland Election scenario - Sakshi

మేఘాలయ నాగాలాండ్ ఎన్నికల చిత్రం  

జాతీయ పార్టీల ఉనికి నామమాత్రం 

చివరి దశకు ఎన్నికల ప్రచారం

మేఘాలయలో ప్రాంతీయ పార్టీలే జోరు మీదున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలతో పాటుగా మరో రెండు పార్టీలు కొత్తగా బరిలోకొచ్చాయి. వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ పార్టీ (వీపీపీ) , కేఏఎం మేఘాలయ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీపీపీ 18 సీట్లలోనూ కేఎంఎం 3 సీట్లలో మాత్రేమే పోటీ పడుతున్నప్పటికీ వాటి ప్రభావం బాగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీల్లా కాకుండా ఈ రెండు పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు అనే అంశాలపై దృష్టి సారించాయి.

గత ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. ఈ సారి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ముకుల్‌ సంగ్మా సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 21 సీట్లు సాధించి సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినప్పటికీ 19 సీట్లలో నెగ్గిన నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), రెండే స్థానాలు గెలిచిన బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలైన యూడీఎఫ్, పీడీపీ, హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (హెచ్‌ఎస్‌పీడీపీ), మరికొందరు స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ, ఎంపీపీ మధ్య విభేదాలు ముదిరాయి.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ ఆర్‌. మారక్‌ గారో హిల్స్‌లో బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా, మారక్‌  ఇరువురు తుర పట్టణానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో మారక్‌కు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. మారక్‌పై ఉన్న సానుభూతితో గారో హిల్స్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. సంగ్మా సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలని బీజేపీ స్థానిక నాయకులు ఒత్తిడి తెచి్చనప్పటికీ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది.

క్రిస్టియన్‌ జనాభా అధికంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుపొంది ఇప్పుడు కనీసం డబుల్‌ డిజిట్‌పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారే పోటీ పడుతున్నట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార వ్యతిరేకత ఎన్‌పీపీపైనే ఉంటుందని ఇతర పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఎన్‌పీపీ కూడా బీజేపీ హిందుత్వ విధానాలు తమ పార్టీకి ఎదురు దెబ్బగా మారుతుందన్న ఆందోళనతోనే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అన్ని పార్టీలకు సవాల్‌ విసిరినా ఈసారి అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీలో ప్రధానంగా ఉన్న ముకుల్‌ సంగ్మా ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈ సారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తమ్మీద ఈ ముక్కోణపు పోటీలో మేఘాలయ ఎన్నికల చిత్రం ఎలా మారుతుందో చూడాలి.  

నాగాలాండ్‌లో మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎవరూ అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీల ఉనికి నామ మాత్రంగానే ఉంది. నాగాలాండ్‌లో ప్రస్తుతం నేషనల్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) బీజేపీ కూటమి అధికారంలో ఉంది.ఎన్‌డీపీపీ 40 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్‌ నాగాలాండ్‌ డిమాండ్‌ ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యమంత్రి నిపుయో రియోకు సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) అవతరించినప్పటికీ , బీజేపీతో ఎప్పట్నుంచో సంబంధాలున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్‌డీపీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ నాగా శాంతి చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఇచి్చంది. ఈ సారి కూడా బీజేపీ ఎన్‌డీపీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 20 స్థానాలకే పరిమితమైంది.

గ్రేటర్‌ నాగాలాండ్‌ డిమాండ్‌ను పరిశీలిస్తామన్న హామీతో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చునన్న ఆశతో ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. బీజేపీ అందరితోనూ రాజీపడుతూ నాగాలాండ్‌లో పట్టు బిగించాలని చూస్తోంది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకుపైనే  గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ 23 సీట్లలో మాత్రమే పోటీకి దిగింది. గత రెండు సార్లు ఎన్నికల్ని పరిశీలిస్తే స్థానిక అంశాలపై అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. 2018లో పోటీకి దిగిన అధికార ఎమ్మెల్యేలలో 70 శాతం మంది మళ్లీ నెగ్గడం విశేషం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top