సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు చుక్కెదురైంది. హుజురాబాద్ పర్యటనలో ఉండగా ఓ బాధితుడు ఆమె ముందరనే గడియారం పగటలగొట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఆమె అవాక్కయ్యారు. తన భర్త ఈటల తీరును బాధితుడు ఎండగట్టాడు. అనుకోని ఘటనతో ఆమెతో పాటు ఈటల అనుచరులు ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హుజురాబాద్‌లోని మామిళ్లవాడలో ఈటల సతీమణి జమున శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సమయంలో కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. తన కుమారుడు క్రీడా పోటీలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందగా ఈటల రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపాడు. అందులో రూ.లక్ష మాత్రమే ఇచ్చారని మిగిలిన రూ.4 లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయాడు. ఈ విషయమై జమునను శ్రీను నిలదీశాడు. ప్రచారంలో ఈటల రాజేందర్ ఫొటోతో ఉన్న గడియారాన్ని కింద పడేసి రభస చేశాడు. అయితే శ్రీను భార్యకు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఓ ఉద్యోగం కూడా కల్పించారు. డబ్బుల కోసమే శ్రీను నిలదీశాడని తెలుస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
