రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి..

Published Fri, Mar 17 2023 2:02 AM

Mallubhatti Vikramarka Padayatra started - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కేసీఆర్‌ పాలనతో రాష్ట్రం యాభై ఏళ్ల వెనక్కి వెళ్లిందని సీఎల్‌పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనలతో ప్రజలు విసుగెత్తిపోయారని, ఆయా పార్టీలను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో పడేద్దామని పిలుపునిచ్చారు. హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కొనసాగింపుగా మల్లుభట్టి విక్రమార్క ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పిప్రి నుంచి పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రను తలపెట్టారు.

గురువారం మొదటి రోజు పిప్రి నుంచి ఇచ్చోడ వరకు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఇచ్చోడలో కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఇక కేసీఆర్‌ ఆటలు సాగవన్నారు. లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టామని చెబుతున్న కేసీఆర్‌వి అన్ని కల్లబొల్లి మాటలేనని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల నిధులు పోయినవి.. నీళ్లు రాలేదు.. ఉద్యోగాలు రాలేదు.. నోటిఫికేషన్లు జారీ చేసి ప్రశ్నపత్రాలను లీక్‌ చేసిన వ్యవహారంలోనూ ఈ ప్రభుత్వ పెద్ద మనుషులే ఉన్నారని ఆరోపించారు.

లక్షలాది నిరుద్యోగుల మానసిక క్షోభకు ఈ ప్రభుత్వం కారణమన్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు మూడు నెలల పాటు తాను పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఈ ప్రభుత్వాల వల్ల జరుగుతున్న మోసాలను తెలియజేస్తానని చెప్పారు.
 
భట్టికి గద్దర్‌ సంఘీభావం 
ఇచ్చోడ సభలో ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొని భట్టికి సంఘీభావం తెలిపారు. పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. కాగా, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ, తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో భట్టి పాదయాత్ర ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావేద్, రోహిత్‌ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌ హన్మంత్‌రావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement