ఆది నుంచీ అంతే: బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో జోష్‌! | Sakshi
Sakshi News home page

Mahabubnagar: బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌లో జోష్‌..!

Published Wed, Jul 14 2021 8:58 AM

Mahabubnagar: Erra Shekhar Resigns BJP Raised Hopes Congress Party - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీకి జిల్లాలో గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరాఠి చంద్రశేఖర్‌ అలియాస్‌ ఎర్రశేఖర్‌ మంగళవారం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయిన అనంతరం ఈ విషయాన్ని ఎర్రశేఖరే స్వయంగా వెల్లడించారు. త్వరలో ‘హస్తం’ గూటికి చేరనున్నట్లు ప్రకటించడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో జడ్చర్ల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామ క్రమంలో బీజేపీలో చేరినప్పటికీ.. అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడం.. ఎర్రశేఖర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదీ నేపథ్యం.. 
1994లో ధన్వాడ ఎంపీపీగా ఎర్రశేఖర్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటికే ఆయన సోదరుడు టీడీపీకి చెందిన ఎర్రసత్యం జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. 1995 ఆగస్టులో ఆయన హత్యకు గురికావడంతో 96లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించారు. 2004లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి లక్ష్మారెడ్డి గెలుపొందగా.. టీడీపీ నుంచి బరిలో ఉన్న ఎర్రశేఖర్‌ ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ఉపసంహరించుకోవడం.. ‘గులాబీ’ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడంతో  2008లో ఉపఎన్నికలు వచ్చాయి. ఇందులో జడ్చర్లలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డితో పాటు టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రశేఖర్‌ ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. ఎర్రశేఖర్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014లో జడ్చర్ల, 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. 

కొందరి నేతల్లో మాత్రం ఆందోళన  
కాంగ్రెస్‌లో మారుతున్న రాజకీయాలతో ఆ పార్టీలోని కొందరు నాయకుల్లో తమ భవిష్యత్‌పై ఒకింత ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రశేఖర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో అటు జడ్చర్లతో పాటు ఇటు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఆయనకు ఏ హామీ లభించిందోనని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో అండదండలున్న వారు తమకేం ఇబ్బంది లేదని అనుచరులతో అన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి గట్టి నేతలు ఎవరూ లేరని.. బీసీ వర్గం అందులోనూ ముదిరాజ్‌ ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉండి పట్టున్న నేత కావడంతో ఎర్రశేఖర్‌కు అక్కడ అవకాశం ఇస్తారనే ఊహాగానాలు ‘హస్తం’ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.  

మొదటి నుంచీ పొసగకనే.. 
బీజేపీలో చేరిన సుమారు ఏడాదిన్నర తర్వాత ఎర్రశేఖర్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ తరఫున రెండు, మూడు కార్యక్రమాలు నిర్వహించిన క్రమంలో కొందరు నేతలతో ఆయనకు పొసగలేదు. ఇంతలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో తనకు తగిన ప్రాధా న్యం లభించలేదని మనస్తాపానికి గురైన వెంటనే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

దీంతో అదే రోజు పార్టీ ప్రముఖులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఉపసంహరించుకున్నారు. కానీ.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని నెలల్లోపే అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేనంటూ రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపగా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన జడ్చర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించినా ఆ తర్వాత మిన్నకుండిపోయారు.  

కాంగీ‘రేసు’లో జోష్‌.. 
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్‌ జిల్లా శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం పెరిగిన పెట్రో ధరలపై నిరసన తెలపాలని పిలుపునివ్వగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఐదు జిల్లాల పరిధిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఎడ్లబండ్లు, సైకిళ్లపై తరలివచ్చారు.

మహబూబ్‌నగర్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వనపర్తిలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, నారాయణపేటలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పరిశీలకుడు వేణుగోపాల్‌రావు, నాగర్‌ కర్నూల్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ జగన్‌లాల్‌ నాయక్, జోగుళాంబ గద్వాల జిల్లాలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవితో పాటు ఆయా జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నాయి. ఇదేక్రమంలో ‘హస్తం’ బలోపేతం దిశగా నేతల చేరికలపై రేవంత్‌రెడ్డి దృష్టి సారించడంతో మంచిరోజులు వస్తాయని భావిస్తున్న శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement