కేరళలో కుస్తీ.. త్రిపురలో దోస్తీ

Kushti in Kerala, dosti in Tripura: PM Modi attacks Congress-CPM alliance - Sakshi

కాంగ్రెస్, సీపీఎంలది ద్వంద్వ నీతి

త్రిపుర ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు

రాధాకిషోర్‌పూర్‌/అంబాసా(త్రిపుర): త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్‌–సీపీఎం పార్టీల కూటమిని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం కేరళలో పోటాపోటీగా కుస్తీ పడుతూ, అవే పార్టీలు ఉమ్మడిగా ఓటర్లను మోసంచేసేందుకు త్రిపురలో దోస్తీ చేస్తున్నాయని మోదీ విమర్శించారు. టిప్రా మోతాకి మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘ఈ విపక్ష కూటమికి ఇంకొన్ని ఇతర పార్టీలు బయటి నుంచి మద్దతు తెలుపుతున్నాయి. ఈ కూటమికి పడే ప్రతీ ఓటు త్రిపురను కొన్నేళ్లు వెనుకడుగు వేసేలా చేస్తుంది’ అని అన్నారు.

శనివారం గోమతి జిల్లాలోని రాధాకిషోర్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ గతంలో అధ్వానంగా పాలించిన పార్టీలు మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం బయల్దేరాయి. అవి కేరళలో కుస్తీ పడతాయి. త్రిపురలో దోస్తీ కడతాయి’ అని అన్నారు. ‘ ఓట్లు చీల్చేందుకు విపక్షం యత్నిస్తోంది. ఇంకొన్ని చిన్న ‘ఓట్లు చీల్చే’ పార్టీలుంటాయి. విజయవంతంగా ఓట్లు చీలిస్తే ఫలితాలొచ్చాక అందుకు ‘ప్రతిఫలం’ పొందుతాయి. ఇంకొందరు తమకు తామే గెలుపుగుర్రాలుగా భావించి గెలిచాక ఇంట్లోనే గడియపెట్టుకుని కూర్చుంటారు’ అని మోదీ విమర్శించారు.

రెండంచుల కత్తితో జాగ్రత్త
‘గత లెఫ్ట్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గిరిజనులను విభజించి పాలించాయి. మేం మాత్రం మిజోరం నుంచి వలసవచ్చిన వేలాది బ్రూస్‌ కుటుంబాలుసహా అన్ని గిరిజన తెగల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. గిరిజన భాష కోక్‌బోరోక్‌ను మా ప్రభుత్వమే ఉన్నత విద్యలో ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లోనూ గిరిజనప్రాంతాల అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాం’ అని అన్నారు. ‘ కాంగ్రెస్‌–సీపీఎం డబుల్‌ ఎడ్జ్‌(రెండు అంచుల) కత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబుల్‌ ఎడ్జ్‌ ప్రభుత్వమొస్తే ప్రజలకు లబ్ధిచేకూరే అన్ని పథకాలను తెగ్గోసి పడేస్తుంది. మా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి ఈ ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి గతిని సుస్థిరం చేయండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ధలాయ్‌ జిల్లాలోని అంబాసాలోనూ మోదీ ప్రచార సభలో ప్రసంగించారు.

దక్షిణాసియా ముఖద్వారంగా త్రిపుర
‘ఈ రెండు పార్టీలు పేదప్రజల కష్టాలు తీరుస్తామని అలుపెరగకుండా వాగ్దానాలు చేస్తారుగానీ పేదల బాధ, కష్టాలను ఎప్పటికీ అర్ధంచేసుకోరు. రాష్ట్రంలో తొలి దంతవైద్య కళాశాల బీజేపీ హయాంలోనే సాకారమైంది. గతంలో పోలీస్‌స్టేషన్లపై సీపీఎం శ్రేణులు ఆధిపత్యానికి దుస్సాహసం చేసేవి. మేమొచ్చాక శాంతిభద్రతలు నెలకొల్పాం. గతంలో రాష్ట్రంలోని యువత జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. మా హయాంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. యాక్ట్‌ ఈస్ట్‌ విధానంతో రాష్ట్రం పురోగమిస్తోంది. త్వరలోనే అభివృద్ధి ఆసియా ముఖద్వారంగా త్రిపుర మారనుంది’ అని మోదీ అభిలషించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top