KTR Strong Counter To Congress Leaders In TS Assembly Session 2023 Over Remarks On TS Govt - Sakshi
Sakshi News home page

Telangana Assembly Session 2023: భట్టి Vs బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీలో కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Sat, Aug 5 2023 6:06 PM

KTR Strong Counter To Congress Leaders In TS Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, సమావేశాల్లో భాగంగా శనివారం అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేసీఆర్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయగా.. హస్తం నేతలకు మంత్రి కేటీఆర్‌ కౌంటరిచ్చారు. 

సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన కొందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మంచివారే. ఆరోగ్యశ్రీని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని కేసీఆరే చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఇక్కడ లేదు.. ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్‌ అని అన్నారు.

► కాంగ్రెస్‌.. ఎక్స్‌పైర్‌ అయిన మందు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు లెక్కలు రావు. కాంగ్రెస్‌కు విశ్వసనీయత పోయింది. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మాకు కట్టడం మాత్రమే తెలుసు. విపక్షాలకు కూలగొట్టడం ఒక్కటే తెలుసు. ​కాంగ్రెస్‌లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు. ఆ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులని ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదని విమర్శించారు.  రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా  అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమయ్యాయన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

► అలాగే, తాము ప్రధాని మోదీకి భయపడలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు.  

► ఇక, అంతకుముందు.. పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే, సీఎల్​పీ లీడర్​ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్​ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్​ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్​ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్​ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. 

► మంత్రి తలసాని కూడా భట్టికి కౌంటరిచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్​ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్​ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్​ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు.

ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?

Advertisement
Advertisement