వారానికి రెండు ఢిల్లీ టూర్లు | Ktr fires on Revanth Reddy | Sakshi
Sakshi News home page

వారానికి రెండు ఢిల్లీ టూర్లు

Jan 26 2024 4:41 AM | Updated on Jan 26 2024 4:41 AM

Ktr fires on Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 45 రోజుల్లో రేవంత్‌ రెడ్డి సాధించింది.. వారానికి రెండు సార్లు ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి పాలన జరుగుతుందని తాము చెప్పిందే నిజమవుతోందని అన్నారు.

గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దావోస్‌ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వేదికపై రైతుభరోసా ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 
బీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై చర్చిస్తున్నాం..
పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పేరును మార్చే అంశంపై చర్చిస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను లోక్‌సభకు పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు.

సీఎం, మంత్రులు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు
‘అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి కంపెనీలతో సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరిట బహుళ జాతి కంపెనీలకు ద్వారాలు తెరిచిందే కాంగ్రెస్‌.  గతంలో నేను దావోస్‌ పర్యటనకు వెళితే స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకునేందుకు వెళ్లానని విమర్శించారు. ఉత్తమ్‌ లాంటి నేతలు దావోస్‌ బోగస్‌ అన్నారు. ఇప్పుడు రేవంత్‌ అదే పనిచేశారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

అటెన్షన్‌ డైవర్షన్‌ పనులు
‘ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అన్ని వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకతను కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం అటెన్షన్‌ డైవర్షన్‌ పనులకు పాల్పడుతోంది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునేందుకు చూస్తే మేము వదిలేది లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అంశంలో తెలంగాణ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి శాశ్వతంగా తాకట్టు పెట్టింది’అని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

కేసీఆర్‌పై జాతీయ పార్టీల కుట్ర
‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. రేవంత్, బండి సంజయ్‌ల వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈ రెండు పార్టీలు ఈసారి కూడా కుమ్మక్కయ్యాయి. పార్లమెంటు ఎన్నికలు త్వరగా వస్తాయనే సమాచారం మాకు ఉంది.

ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10లోపు రోజుకు సగటున పది అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత సమావేశాలు జరుగుతాయి. త్వరలో 31వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి 31వేలకు పైగా సోషల్‌ మీడియా కార్యకర్తలతో ‘తెలంగాణ బలగం’పేరిట నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తాం. సోషల్‌ మీడియాను కూడా బలోపేతం చేస్తూ క్షేత్ర స్థాయి సమాచారం పార్టీకి అందేలా యూ ట్యూబ్‌ చానెళ్లు.. ఇతరత్రా వేదికలు ఏర్పాటు చేస్తాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయశక్తులే కీలకం
మోసం కాంగ్రెస్‌ నైజమని, నయవంచనకు నిలువెత్తు రూపం అయినందునే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు ఏర్పడ్డాయని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మోదీ, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కుగానీ, ఇండియాకూటమికి గానీ లేదన్నారు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్‌లో మమతాబెనర్జీ, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్‌ అయినా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేది రాష్ట్రాల్లోని బలమైన పార్టీలేనని  చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement