
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నా.. పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయానికి ‘‘బాబు ష్యూరిటీ- గుండాయిజం గ్యారంటీ..’’ శీర్షికతో సాక్షి ప్రచురించిన ఒక కథనం అద్దం పడుతోంది.
కొద్ది రోజుల క్రితం ఒక స్వతంత్ర సంస్థ జరిపిన సర్వే కూడా ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యధిక శాతం ప్రజలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కోరుకున్నా అది ఆశించినంతమేర సాగడం లేదని సమాచారం. ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తమవుతూండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు పట్టుపడుతూండటంతో ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అంటూ జనంలోకి వెళుతోంది. అన్ని నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలకు చేసిన మోసాలను అంకెలతో వివరిస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వానికి చికాకుగా మారింది. దీన్ని అడ్డుకునేందుకా అన్నట్టు టీడీపీ, జనసేనలు రెండూ వైసీపీ సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
గుడివాడలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగులగొట్టి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి?
వైఎస్సార్‌సీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్దారకులం అని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిపై మాత్రం పెట్టలేదట. అసలు అల్లరికి కారణమైన వ్యక్తిని వదలి వేస్తే ఏమిటి అర్థం? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు!
నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వేగంగా స్పందించారు. ఎవరి తప్పు ఉన్నా కేసు పెట్టవచ్చు. కాని పోలీస్ యంత్రాంగం ఒక వైపే చూడడం ఏపీ స్పెషాలిటీగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా, పోలీసులు ఏదో రకంగా అడ్డం తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్‌కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు.
అనంతపురం వద్ద లింగమయ్య అనే వైఎస్సార్‌సీపీ నేత హత్యకు గురైతే అక్కడకు జగన్ వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాఫ్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా, దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడా అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్ష పెట్టి ఏమి సాధించదలిచారు.
అయినా జనం వేలాదిగా తరలివచ్చారు అంటే అది జగన్ మీద అభిమానంతోనే కదా? దానిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్టు చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతించారు?
వైఎస్సార్‌సీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడం అధికార పార్టీ కూటమికి కంటగింపుగా మారింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారే అల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో ఏపీలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంటోంది. రాజకీయపరమైన వేధింపులే కాదు.. ఇతరత్రా కూడా అనేక సంఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది.
మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక మహిళా నేతను బెదిరించడానికి బొజ్జల అనుసరించారని వస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తాయి.
అవి నిజమైతే అయితే ఈయనపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదని వినూత దంపతులు చెబుతున్నారు. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రం అయినా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికి తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. వినూతను ఎవరు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, మొదలైన అంశాలు పూర్తిగా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ హత్యపై వస్తున్న వార్తల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వంటివారు నోరువిప్పడం లేదు. ఇంకో వైపు కరేడు వద్ద భూ సేకరణ వివాదం, ఇండోసోల్‌కు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా!
రాజధాని అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జైలులో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడం, పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం వంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దాని వల్ల ఏపీ ఇమేజీ తీవ్రంగా డామేజి అవుతోంది. అయినా ఫర్వాలేదు.. తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవల్సిందే.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.