
సాక్షి, హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలు కురిసి నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు అనేక మంది బాధితులకు డబ్బులు అందలేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులు ఇంటి దగ్గరే ఉండాలని, ఇంటికే వచ్చి డబ్బులు ఇస్తామని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్న మంత్రి మీ సేవ వద్ద వందల సంఖ్యలో క్యూలైన్‌లు కడుతున్నారని మండిపడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు లైన్‌లో నిలబడ్డ చాలా మంది అప్లికేషన్స్‌ను స్వీకరించడం లేదని విమర్శించారు. చదవండి: ముగ్గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
‘క్యూలైన్‌లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు కూడా ఉంటున్నారు. చాలా మంది లైన్‌లో నిలబడి సొమ్ము జిల్లిపోయి కింద పడుతున్నారు. లైన్‌లో నిలబెట్టి ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తుంది. ప్రజలను అవమానపరిచే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు. ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణమే ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపనా చెప్పాలి. టీఆర్‌ఎస్ ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోవు. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎస్ గెలవాలని చూస్తుంది. టీఆర్‌ఎస్‌కు జీహెచ్‌ఎంసీ ప్రజలు బుద్ధి చెబుతారు’ అని పేర్కొన్నారు.