బుజ్జగింపా? సాగనంపా? ప్రియాంక సమక్షంలో తేలనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంచాయితీ!

Komatireddy Venkat Reddy Goes Delhi After AICC Called Him - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా లేదంటే ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి కోమటిరెడ్డికి ఫోన్‌ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో భట్టి విక్రమార్క్‌, శ్రీధర్‌బాబు ఉన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాత్రం నిన్న రాత్రే హైదరాబాద్‌కు వచ్చేశారు. దీంతో వీళ్లిద్దరి సమక్షంలోనే ప్రియాంక లేదంటే ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

బుజ్జగింపా? సాగనంపడమా?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రియాంక సమక్షంలోనే ఆయన పంచాయితీ తేలనుందని కొందరు అంటుంటే.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌లతో చర్చలు జరిపించే అవకాశాలు ఉన్నాయని మరో సమాచారం. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తననూ విమర్శిస్తున్నారని, అది పార్టీకి చేటు చేస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ప్రియాంక గాంధీ వద్ద ప్రస్తావించారు.

అలాంటప్పుడు ఇంకా ఉపేక్షించకుండా.. వెంకట్‌రెడ్డిని సాగనంపడమే మేలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. సస్పెండ్‌ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అంశంపై చర్చ జరగ్గా.. ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి: పాస్‌పోర్టు వాడినంత మాత్రాన చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడు కాలేడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top