Basavaraj Bommai: వారికి పింఛన్‌ పెంపు, రైతు బిడ్డల కోసం

Karnataka CM Basavaraj Bommai Scholarship Scheme Farmers Children - Sakshi

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బసవరాజ్‌ బొమ్మై బుధవారం తొలిసారిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... వితంతు, వికలాంగుల పింఛన్‌ను 600 రూపాయల నుంచి 800 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రైతు బిడ్డల కోసం ప్రత్యేక ఉపకార వేతన పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల నిధిని కేటాయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలో ఈ మేరకు బొమ్మై మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

ఇక ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కోవిడ్‌-19, వరదలు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించేందుకు శాయశక్తులా కృషి​ చేస్తాం.

అదే విధంగా పేద, రైతుల అభ్యున్నతికి తోడ్పడుతూ.. వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కర్ణాటక ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటాను’’ అని సీఎం బొమ్మై తెలిపారు. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇంత వరకు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ను కలిసినపుడు.. ఢిల్లీ వెళ్లిన తర్వాత అంశంపై చర్చిద్దామని చెప్పారు’’ అని సీఎం బొమ్మై సమాధానమిచ్చారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top