MLC Elections: పెరిగిన ఎమ్మెల్సీ వేడి.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు

Karimnagar: L Ramana Kaushik Are In Race For MLA Quota MLC  - Sakshi

 ప్రగతి భవన్‌ నుంచి ఆశావహులకు ఫోన్‌కాల్స్‌

ఎమ్మెల్యే కోటాలో రమణ, కౌశిక్‌లకు బెర్త్‌

స్థానిక సంస్థల పోటీలో చెన్నాడి, గెల్లు, వీర్ల

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో పలువురికి ప్రగతిభవన్‌ నుంచి సీఎం నేరుగా ఫోన్‌చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు, ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లను దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం నాలుగు సీట్లు దక్కనున్నాయి.

వాస్తవానికి ఆరుగురు అభ్యర్థుల్లో బీసీ సామాజికవర్గం నుంచి ఎల్‌.రమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి స్థానాలు ఖరారయ్యాయని సమాచారం. ఇటీవల గవర్నర్‌ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్‌చేసినా.. ఆయనపై ఉన్న కేసుల కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అధిష్టానం కౌశిక్‌కు బెర్త్‌ కన్‌ఫర్మ్‌  చేసిందని ప్రచారం జరుగుతోంది. 
చదవండి: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం

స్థానిక సంస్థల కోటాలో తెరపైకి ముగ్గురు!
త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో రెండుస్థానాల ఆశావహుల జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం ఓసీ (వెలమ సామాజికవర్గం) భానుప్రసాదరావు, బీసీ (ఎల్లాపు) నుంచి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈసారి వెలమసామాజికవర్గానికి చెందిన చెన్నాడి సుధాకర్‌రావు, బీసీ (యాదవ) నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు, మాజీ జెడ్పీటీసీ వీర్ల వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. 

భాను ప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్‌హామీ దక్కడంతో ఆయన పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారదాసు లక్ష్మ ణరావుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడోసారి ఎమ్మెల్సీ టికెట్‌ దక్కే చాన్స్‌లు దాదాపుగా లేవనే చెబుతున్నారు. పార్టీ మొత్తంగా భర్తీ చేయనున్న 18 సీట్లలో నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లా నుంచి భర్తీ కానుండటం గమనార్హం. 

హుజూరాబాద్‌ ఓటమిని మరిచిపోయేలా.. 
మరోవైపు పార్టీలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓ టమి తీరని నైరాశ్యాన్ని నింపింది. నాలుగైదు నెలలపాటు భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాగా ఉన్న పార్టీకి ఈటల విజయం సాధించడంతో ఊ హించని భంగపాటు ఎదురైంది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. అందుకే, ఆ నష్టాన్ని పూడ్చాలంటే.. రాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో సీట్లు కైవసం చేసుకుని తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాలి. అందుకే, పకడ్బందీగా ప్లాన్‌ చేసి ప్రతిపక్షాలను తిరిగి ఆత్మరక్షణ ధోరణిలో పడేసేలా పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆది నుంచి టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలనీయవద్దన్న పట్టుదలతో పకడ్బందీగా ముందుకు సాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top