పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్‌

Published Wed, Jan 3 2024 12:28 PM

Kakinada Public Meeting: Cm Jagan Comments On Chandrababu And Pawan - Sakshi

సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని  ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇ‍వ్వలేదని మండిపడ్డారు.

‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా  రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. 
22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి
ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు
కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు
పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు
ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే
అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు
ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు
అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు
చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు
గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని?  సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర
అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది
ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు
ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి
అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ
కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు
అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? 
అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు
గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. 
అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు
ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది
చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు
ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు
గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు
ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది.
గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు
45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. 
ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం
వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం.
ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం
అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం
ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది
ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు
రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది
అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. 
ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. 
గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి
ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి
వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి
1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం
రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి
కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి
ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్‌.. ట్యాబులంటే మీ జగన్
గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్
గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్
ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి
ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. 

రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది
ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు
కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి
రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. 
అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా
మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు
మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు
మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు
మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు
అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. 


 

Advertisement
Advertisement