
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.
ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.
నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు.