నేనేం బీజేపీలో లేను

I am not your party member Mamata tells Narendra Modi - Sakshi

నాకు సలహాలు ఇవ్వవద్దు; నందిగ్రామ్‌లో నా విజయం ఖాయం

ప్రధాని మోదీకి దీదీ మమత జవాబు

దిన్హట/నాటాబరి: నందిగ్రామ్‌లో తన విజయం ఖాయమని, వేరే స్థానం నుంచి పోటీ చేయమని ప్రధాని నరేంద్రమోదీ తనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోబోతున్నారని, అందుకే ఆమె వేరే స్థానం నుంచి కూడా పోటీ చేస్తారేమోనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ముందు మీ పార్టీకి చెందిన హోం మంత్రిని కంట్రోల్‌ చేయండి. నన్ను నియంత్రించేందుకు, నాకు సలహా ఇచ్చేందుకు నేనేం మీ పార్టీ మెంబర్‌ను కాదు’ అని మమత జవాబిచ్చారు. మమత శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు.

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం కాదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘200 స్థానాల్లో టీఎంసీ గెలవాలి. లేదంటే ఎమ్మెల్యేలుగా గెల్చిన కొందరు ద్రోహులను బీజేపీ వాళ్లు కొనేస్తారు’ అని హెచ్చరించారు. మెజారిటీ భారీగా లేకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే అవకాశముందని మమత పరోక్షంగా వ్యాఖ్యానించడం విశేషం. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగని బలమైన వారు టీఎంసీ తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండాలని సూచించారు. తమిళనాడులో అమిత్‌ షా ఆదేశాల మేరకు  డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ బంధువులు, ఇతర నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top