Huzurabad Bypoll: అధినేతలకు సిసలైన సవాలే..

Huzurabad Bypoll: All Parties Focused On Campaigning - Sakshi

హుజూరాబాద్‌లో ఊపందుకోనున్న ప్రచారం

స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన పార్టీలు

గులాబీ స్టార్లంతా నాలుగునెలలుగా ఇక్కడే..

ఫైర్‌బ్రాండ్లతో జాబితా విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్‌

అధినేతలకు ఈ ఉపఎన్నిక సిసలైన సవాలే..!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే బీజేపీ–టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక నేతలు దాదాపు 17 వారాలుగా ప్రచారంలో తలమునకలయ్యారు. ఆ పార్టీల మధ్య నువ్వా–నేనా అన్న స్థాయిలో యుద్ధం నడుస్తోంది. శుక్రవారం నామినేషన్ల ఆఖరు రోజు అందరి కంటే ఆలస్యంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్‌కు వచ్చి ప్రసంగించి కేడర్‌లో జోష్‌ నింపారు. మొత్తానికి ఇంతకాలం స్థానిక నేతలతో సాగిన ప్రచారం ఇంకాస్త రంగులద్దుకోనుంది. స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారానికి దిగుతుండటంతో వారి చరిష్మా పార్టీకి తప్పకుండా ఉపయోగపడుతుందని, ఓటర్లను వారు తప్పకుండా ఆకర్షించగలుగుతారని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్టార్‌ క్యాంపెయిన్ల జాబితాలో పేర్కొన్న టీఆర్‌ఎస్‌ నేతల్లో దాదాపు అంతా నాలుగు నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ జాబితాలో ఫైర్‌ బ్రాండ్లకే పెద్దపీట వేశారు. దీంతో హుజూరాబాద్‌ ప్రచారం మరింత పదునెక్కనుంది.

అధినేతలకు సిసలైన సవాలే..
మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం బరిలో నిలిచాయి. ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ, పూర్వ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌కు ఇది తొలి ఉప ఎన్నిక కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా బైపోల్‌ను సవాలుగా తీసుకున్నారు. తనకు ఎంతో అచ్చివచ్చిన హుజూరాబాద్‌ నియోజకవర్గం కావడంతో టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కూడా ఉపపోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఈ ఉపఎన్నిక చాలాకీలకంగా మారింది. 

చదవండి: (Huzurabad Bypoll 2021:పెంచేటోళ్లు వాళ్లు.. పంచేటోళ్లం మేము)

బండి, కిషన్, విజయశాంతి ప్రత్యేక ఆకర్షణ..!
ప్రజాసంగ్రామ యాత్ర కావడం వల్ల ఇంతకాలం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ హుజూరాబాద్‌ ప్రచారానికి పెద్దగా అందుబాటులో లేకుండాపోయారు. ఇప్పుడు స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో తొలిస్థానంలో ఆయనే నిలవడం గమనార్హం. తరువాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, తరుణ్‌చుగ్, డా.లక్ష్మణ్, మురళీధర్‌రావు, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి,  వివేక్, విజయశాంతి, చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్‌ తదితరులు 20 మంది జాబితాలో ఉన్నారు. బండి, అరవింద్, డీకే, రఘునందన్‌ అంతా ఫైర్‌ బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ అందరిలోనూ బండి సంజయ్,  కిషన్‌రెడ్డి, విజయశాంతి సభలకు జనాలు భారీగా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.

కేసీఆర్, కేటీఆర్‌లే స్టార్లు..!
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా 20 మందితో కూడిన తమ స్టార్‌ క్యాంపెయిన్ల లిస్టు విడుదల చేసింది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పుల, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, పెదిŠద్‌ సుదర్శన్‌ రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే.. వీరంతా ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన జూన్‌ 12 తరువాత నుంచి హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. 20 మంది జాబితాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మినహా అంతా 17 వారాలుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ లోకల్‌ స్టార్లుగా మారిపోవడం గమనార్హం.

అజారుద్దీన్, సీతక్క ప్రత్యేకం..
కాంగ్రెస్‌ పార్టీ సైతం 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్, భట్టి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, అనసూయ సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉ న్నారు. వీరిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్, జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి అంతా ఫైర్‌బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ జాబితాలో అజారుద్దీన్, అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top