కారు దిగనున్న నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌..? 

Huge Joins In BJP After Sankranti In Medak - Sakshi

జిల్లా నేతలకు రాష్ట్ర అధ్యక్షుడి దిశానిర్దేశం

పార్టీ బలోపేతం.. చేరికలపై దృష్టి 

టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు, కాంగ్రెస్‌ ముఖ్యులపై ఆరా 

సంక్రాంతి తర్వాత భారీగా చేరికలు !

జిల్లాపై కమల దళం ప్రత్యేక నజర్‌ వేసింది. ఓ వైపు పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు పక్కా ప్రణాళికతో ఆకర్షః మంత్రం పటిస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో టీఆర్‌ఎస్‌లోని అసమ్మతులతో పాటు కాంగ్రెస్‌ ముఖ్యులపై దృష్టి సారించిన రాష్ట్ర స్థాయి నేతలు జిల్లాల వారీగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన వారు.. జిల్లాలో సంక్రాంతి తర్వాత భారీ ఎత్తున చేరికలకు   రంగం సిద్ధం చేస్తున్నారు.  

సాక్షి, మెదక్‌ : దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచింది. జిల్లాల వారీగా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేసేందుకు సమాయత్తమైంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌ రెడ్డి, నల్లాల విజయ్, ఉపాధ్యక్షుడు దత్తు ప్రకా ష్‌తో ఆదివారం సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ మేరకు వివరాలు ఆరా తీశారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసమ్మతి నేతలు.. కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏ వర్గం వైపు ఉంటారు.. ఎవరు బలంగా ఉన్నారు.. వంటి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నట్లు సమాచారం. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలతోపాటు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణకు అనుగుణంగా శ్రమించాలని దిశానిర్దేశం చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు.  

ఇదివరకే టచ్‌లో మెదక్‌ నేతలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా గులాబీ కీలక నేతల పేర్లు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మెదక్‌లో అధికార పార్టీలో కీలకంగా అన్నీ తామై వ్యవహరిస్తున్న నేతలు ఇదివరకే బీజేపీ జాతీయ నాయకులతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధానంగా వారిపైనే చర్చించినట్లు సమాచారం. వారికి ఉన్న ప్రజా బలం వంటి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి.. నేతల దారిపైనా పూర్తిస్థాయిలో చర్చించినట్లు వినికిడి. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వైపు ఎవరెవరు ఉంటారు.. బీజేపీలో ఎవరెవరిని చేర్చుకోవచ్చు అని సంజయ్‌ ఆరా తీసినట్లు సమాచారం.  

నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంశం సైతం.. 
టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ అంశం సైతం సమావేశంలో చర్చించారు. ఆయనతోపాటు ఎవరెవరు టీఆర్‌ఎస్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారనే వివరాలను సంజయ్‌ ఆరా తీసినట్లు పార్టీ జిల్లా నేతలు చెబుతున్నారు. మురళీధర్‌ యాదవ్‌ “కారు’ దిగడం ఖాయమని.. ఆయనతోపాటు చిన్నశంకరంపేట, హవేళిఘనపూర్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్‌ మండలాలకు చెందిన పలువురు ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాలో భారీగా చేరికలుంటాయని చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top