Tamil Nadu: ‘ఆ ముగ్గురి గెలుపులో గోల్‌మాల్‌’ 

HC Issues Notice To EC For 3 Leaders Win Tamil Nadu Assembly Elections - Sakshi

మంత్రి దురైమురుగన్,  విజయ భాస్కర్, జయకుమార్‌పై కోర్టులో పిటిషన్లు 

అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి 

4 వారాల్లోగా బదులివ్వాలని ఈసీకి ఆదేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి.విజయభాస్కర్, జయకుమార్‌ గోల్‌మాల్‌కు పాల్పడి గెలుపొందారని.. వారిని అనర్హులుగా ప్రకటించేలా ఈసీని ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్‌ గెలుపును అన్నాడీఎంకే అభ్యర్థి వి. రాము సవాల్‌ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వచ్చిన అర్హమైన ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారని, ఎన్నికల నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆరోపించారు. తపాలా, ఈవీఎం ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టును కోరారు.

పుదుక్కోటై జిల్లా వీరాలిమలై నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి సి. విజయభాస్కర్‌ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన ఎం. పళనియప్పన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బహుమతులు, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టారని, ఎన్నికల నియయావళి కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు. విజయభాస్కర్‌ గెలుపు చెల్లదని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఈరోడ్‌ జిల్లా పెరుందురై నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయకుమార్‌ గెలుపు చెల్లదని పేర్కొంటూ డీఎంకే చిహ్నం ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేసిన కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి అభ్యర్థి కేకేసీ బాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈవీఎంల పనితీరు సక్రమంగా లేదని పోలింగ్‌ సమయంలోనే ఫిర్యాదు చేశామని, అయితే వాటిని సరిచేయకుండా పోలింగ్‌ను కొనసాగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ 81 ఈవీఎంలలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి వి. భారతిదాసన్‌ ముందు సోమవారం విచారణకు వచ్చింది. మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి విజయభాస్కర్, జయకుమార్‌ గెలుపును సవాలు చేస్తూ పిటిషనర్లు వెలిబుచ్చిన ఆరోపణలపై చీఫ్‌ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయా నియోజకవర్గాల అధికారులు 4 వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top