నేను ఫైటర్‌ని.. దేనికి భయపడను : కేసీఆర్‌

GHMC Elections 2020 : CM KCR Fires On BJP - Sakshi

వరద సాయం బీజేపీనే నిలిపేలా చేసింది

డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై సదస్సు : సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్‌ నుంచే మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరిని ఈ సమావేశానికి ఆహ్వనిస్తామన్నారు. మమతా బెనర్జీ ,కుమార స్వామి ,అఖిలేష్ యాదవ్,స్టాలిన్‌తో పాటు మరికొన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. తాను ఫైటర్‌ని అని, దేనికి భయపడబోనని, బీజేపీపై యుద్ధమే చేస్తానన్నారు. 
(చదవండి : గ్రేటర్‌లో వరద సాయానికి బ్రేక్‌!)

బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ ప్రజప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 110 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, అభ్యర్థులు, కార్యకర్తలు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. బీజేపీ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు.  ఈ రోజు జీహెచ్ఎంసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఎవరూ కంగారు పడొద్దని, అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. అందరికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. 

బీజేపీది వరద రాజకీయం 
వదర సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా, వరద సాయం నిలివిపేయాలని ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఫలితాలు వచ్చే వరకు వరద సాయం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top