మరో 15 రోజులు రిమాండ్‌ పొడిగించండి | Sakshi
Sakshi News home page

మరో 15 రోజులు రిమాండ్‌ పొడిగించండి

Published Mon, Sep 25 2023 4:15 AM

Extend the remand for another 15 days - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్‌ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది.

ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్‌ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. 

సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు..
చంద్రబాబును జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేష్‌ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్‌ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది.

సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నా­రని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది.

సరిహద్దు చెక్‌పోస్టులోముమ్మర తనిఖీలు
జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్‌ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.

మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్‌­పోస్టు ఇన్‌చార్జ్‌ రమేష్‌ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్‌ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement