చిన్నోడినే కావచ్చు చిచ్చర పిడుగును: ఈటల

కమలాపూర్: తప్పుచేస్తే తనను జైలుకు పంపాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన ప్రజాదీవెన పాదయాత్ర సభల్లో ఈటల మాట్లాడారు. కేసీఆర్‌కు నీతి, జాతి, మానవత్వం లేదని, ఆయన మనిషే కాదన్నారు.
ఒక్కసారి తింటేనే మరిచిపోమని, అలాంటిది 18 ఏళ్లు తనతో పని చేయించుకుని, చివరకు భూ కబ్జాదారుడినని బయటకు పంపించాడని మండిపడ్డారు. ‘16 ఏళ్ల క్రితం ఒకాయన నక్సలైట్‌కు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చాడని కేసు పెట్టారు. ఇప్పుడా కేసును మళ్లీ బయటకుతీసి జైల్లో పెడతామని 3 రోజుల్నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వెంట పడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడే వాళ్లు కాదు నా అభిమానులు’ అని ఈటల అన్నారు. తాను చిన్నోన్నే కావచ్చు కానీ చిచ్చర పిడుగునని, గెలిచిన తర్వాత తెలంగాణలో విప్లవం వస్తుందన్నారు.