డీకే రవి భార్యకు కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌

DK Ravi wife Kusuma joins Congress - Sakshi

సాక్షి, బెంగళూరు : ఐదేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన యువ ఐఏఎస్‌ అధికారి డీకే రవి సతీమణి డీకే కుసుమ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ సమక్షంలో ఆదివారం పార్టీలో జాయిన్‌ అయ్యారు. త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిలో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీటు హామీ మేరకే కుసుమ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పేరును కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు డీకే శివ కుమార్‌ వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువతిని ఆ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై హైకమాండ్‌ నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. (మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా)

కాగా కర్ణాటకకు చెందిన డీకే రవి 2015లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. ఈ సంఘటన అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని రవి తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన  కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రవిది ఆత్మహత్యగానే నిర్ధారించింది. వ్యక్తిగతమైన కారణాల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదించింది. తాజాగా అతని భార్య కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

కాగా రాజమహేశ్వరీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మునిరత్నం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అభ్యర్థుల వేటులో నిమగ్నమయ్యారు. బీజేపీ నుంచి మునిరత్నం బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయనపై బలమైన మహిళా అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే కుసుమను సంప్రదించింది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top