తీవ్ర అసంతృప్తి.. మరొకవైపు పార్టీ మారమని ఒత్తిడి!

Dilemma in Samudrala Venugopal Chary Political Career - Sakshi

ఎంతటి నాయకులకైనా ఒక్కోసారి అజ్ఞాతం తప్పదు. ఎంత సీనియర్ అయినా ఎన్నికల రాజకీయాలకు దూరం కాక తప్పదు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ సీనియర్ నేతకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన రాజకీయాలు చేయలేకపోతున్నారట. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఆ నేతను బుజ్జగించేందుకు గులాబీదళపతి ఓ పదవి ఇచ్చారట. అయినా ఆనేతలోని అసంతృప్తి చల్లారలేదట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో చూద్దాం..

దశాబ్దాల రాజకీయ అనుభవం. నాలుగు సార్లు ఎమ్మెల్యే..మూడు సార్లు ఎంపీ...ఓసారి కేంద్ర మంత్రి...మరోసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను కనుసైగలతో నడిపించిన నాయకుడు సముద్రాల వేణుగోపాలచారి. గులాబీ దళంలో చేరాక కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీ  చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీలో టిక్కెట్ లభించలేదు. అయినాగాని రాజ్యసభ ఎంపీ.. లేదంటే ఎమ్మెల్సీ పదవితో పట్టాభిషేకం జరుగుతుందని ఆశించారు. అవేమీ వరించలేదు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పదవికి చారిని నామినేట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో ఒక పదవి దక్కినా చారికి సంత్రుప్తి కలగలేదనే టాక్ వినిపిస్తోంది.  

తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సముద్రాల వేణుగోపాలాచారి... మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే.. గులాబీపార్టీలో చేరారు. తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత డిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా చారిని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2018 ఎన్నికల్లో పోటీ  చేయకపోయినా పార్టీని  విజయపథాన నడిపించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వంలో మంచి పదవి లభిస్తుందని చారి ఎన్నో  ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. సీఎం కేసీఆర్‌తో గతం నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతా లభించలేదు. దీంతో చారి  తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. గులాబీ పార్టీని వీడి కమలం గూటికి చేరతారనే ప్రచారంతో అప్రమత్తమైన గులాబీ బాస్ చారిని ఇరగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

అయితే చారికి  రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టకున్న ఆయన అనుచరులు..కార్పొరేషన్ పదవితో సరిపెట్టడం  అసంత్రుప్తికి గురిచెసిందట. కేంద్రంలోను..రాష్ట్రంలోనూ మంత్రిగా చేసిన వ్యక్తికి కేసీఆర్ ప్రభుత్వం తగిన పదవి ఇవ్వలేదని ఆయన అనుచరులు  అందోళన చెందుతున్నారట. వేణుగోపాలాచారి స్థాయిని తగ్గించేందుకే కార్పొరేషన్ పదవి ఇచ్చారని పార్టీ పై అక్కసు వెళ్లగక్కుతున్నారట. 2018 ఎన్నికల్లో చారికి టిక్కెట్ లభించలేదు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇలా    దశాబ్ద కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావడంపై ఆయన అనుచరులు అందోళన చెందుతున్నారట. ఇకముందు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావద్దని పార్టీ మారైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ చారి మీద ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది.  

ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని చారిపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అనుచరులను చారి బుజ్జగిస్తున్నారని.. కానీ అనుచరులు మాత్రం తగ్గేదేలే అంటున్నారని తెలుస్తోంది. మరి సముద్రాల వేణుగోపాలాచారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top