రాజకీయాల్లో ప్రతీకారం ఏంటి..? ఫడణవీస్ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్..

Devendra Fadnavis Revenge Comment Shiv Sena Sanjay Raut Counter - Sakshi

ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్‌) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు.

రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఓ మరాఠీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ‍ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష‍్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు.
చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ రాజీనామా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top