
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో చెరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం యోచిస్తున్నాయి. ఆ మేరకు బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. వీలును బట్టి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేయాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ వల్లే బీఆర్‌ఎస్ గెలిచిందని, కాబట్టి ఆ పార్టీ మళ్లీ అధికారం రావాలంటే తమతో పొత్తు తప్ప మరో గత్యంతరం లేదని సీపీఐ, సీపీఎం చెబుతున్నాయి.
అయితే 20 సీట్లు బీఆర్‌ఎస్ ఇస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు చివరకు చెరో ఐదు సీట్లయినా ఇవ్వాలని పట్టుబడతామని ఆ పార్టీల నేతలు అంటున్నారు. చెరో ఐదు స్థానాలైనా ఇవ్వకపోతే పొత్తుపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే చెరో ఐదు స్థానాలైనా బీఆర్‌ఎస్ ఇస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.